Kamal 237 Movie Directors : లోక నాయకుడు, కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. 'కల్కి 2898 ఏడీ', 'ధగ్ లైఫ్' అనే చిత్రాల షూటింగుల్లోనూ ఆయన సందడి చేస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ ఎంతో విలక్షణంగా నటిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఆయన నటించిన 'విక్రమ్' ఎంతటి సూపర్‌హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఆయన్ను మరిన్ని యాక్షన్ సినిమాల్లో చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరో ప్రాజెక్టుకు సైన్ చేశారు.
'కమల్ 237'గా తెరకెక్కనున్న ఈ మూవీ ప్రస్తుతం పట్టాలెక్కేందుకు సన్నాహాలు జరుగుతోంది. అయితే ఈ చిత్రంతో కోలీవుడ్ కవల యాక్షన్ కొరియోగ్రాఫర్లు అన్బరివ్ (అన్బుమణి, అరివుమణి) డైరెక్టర్లుగా మారుతున్నారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా తన అభిమానుల కోసం తాజాగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
"ఇద్దరు ప్రతిభావంతులు వారి కొత్త అవతారంగా నా 237వ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మాస్టర్స్ అన్బరివ్‌లకు మా రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్‌కి తిరిగి స్వాగతం పలుకుతున్నాం" అంటూ ఎక్స్ ద్వారా ఆయన వారికి వెల్కమ్ చెప్పారు. మరోవైపు ఈ సినిమాను కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ తమ రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు.