తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Kamal Haasan: రజనీతో దాని గురించి మాట్లాడను: కమల్​ హాసన్

Kamal Haasan on Rajinikanth: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇటీవలే మీడియాతో మాట్లాడిన కమల్​.. తన స్నేహితుడు, సూపర్​స్టార్ రజనీకాంత్​ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. రజనీతో సినిమాల నుంచి ప్రజల వరకు అన్ని విషయాలు మాట్లాడే కమల్​.. ఓ విషయం గురించి మాత్రం ప్రస్తావన తీసుకురారట. అదేంటంటే..

Kamal Haasan
rajinikanth

By

Published : Jun 2, 2022, 8:52 AM IST

Kamal Haasan on Rajinikanth: దేశంలో నటనకు డిక్షనరీ తయారు చేస్తే దాని పేరు.. కమల్‌ హాసన్‌. వెండితెరపై జరిగిన ప్రయోగాలకు ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ పెడితే దాని తంబ్‌నెయిల్‌.. కమల్‌హాసన్‌. సినిమా రంగంలో ప్రతిభకు ఇన్‌స్టా పేజీ నడిపించాల్సి వస్తే.. దాని డీపీ కమల్‌ చిత్రమే. బడిలో అఆలు దిద్దే వయసులోనే కెమెరా ముందుకొచ్చిన కమల్‌హాసన్‌.. నిత్య విద్యార్థిలా మెలుగుతూ ఆరు పదుల వయసులోనూ అదే ఉత్సాహంతో నటిస్తున్నారు. మెరుస్తున్నారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఆయన నటించిన 'విక్రమ్‌' శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కమల్‌ హాసన్‌ విలేకర్లతో ముచ్చటించారు.

.

ఈ మధ్య మీ స్నేహితుడు రజనీకాంత్‌ని కలిసినట్టున్నారు. ఏం మాట్లాడుకున్నారు?

నలభయ్యేళ్లుగా మేం అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటాం. సినిమాలు, ప్రజల గురించి ఇలా పలు విషయాలు చర్చకొస్తుంటాయి. ఇప్పుడూ అదే మాట్లాడుకున్నాం. రాజకీయాల ప్రస్తావన మాత్రం రాదు. ఎందుకంటే భిన్నమైన ఫిలాసఫీని నమ్మే వ్యక్తులం మేం. అన్నిటికంటే స్నేహాన్ని ఎక్కువగా గౌరవిస్తాం. 'విక్రమ్‌' వైబ్రేషన్స్‌ బాగున్నాయంటూ శుభాకాంక్షలు చెప్పారు.

రజనీతో కమల్

అడవి.. వేట అంటూ ప్రచార చిత్రంలో ఫిలాసఫీ చెప్పారు. ఇంతకీ సినిమా ఎలా ఉంటుంది?

మనం బతుకుతున్న ఈ ప్రాంతాన్ని కాంక్రీట్‌ జంగిల్‌ అంటున్నాం. అలా అనుకుంటే మనం అడవిలో ఉన్నట్టే కదా. అదే ఈ సినిమా. డ్రగ్స్‌, స్మగ్లింగ్‌.. ఇలా పలు విషయాలు ఉంటాయి. మాదక ద్రవ్యాల విషయంలో అనుకోకుండా, మనకు తెలియకుండానే మనం అందులో భాగమయ్యాం. అదెలా అనేది తెరపై చూసి తెలుసుకోవల్సిందే. విలన్‌ అంటే ఎక్కడి నుంచో పుట్టుకురాడు. మనలోనే ఉంటాడు. ప్రతి పాత్రలోనూ రెండుకోణాలు ఉంటాయి. నేను స్టార్‌ అని ఎప్పుడూ చెప్పను. నేనొక నటుడిని. ప్రేక్షకుల దయవల్ల స్టార్‌ని అయ్యా. నా విలన్లు హీరోలకి సమానమైన బలంతో కనిపిస్తారు. నేను రాసిన కథల్లోనూ అంతే. పోస్టర్‌లోనూ ఆ నటులు ప్రధానంగా కనిపిస్తుంటారు.

మీరు నటించే సినిమాల్లో ఏదో ఒక సవాల్‌ ఉండాల్సిందే కదా. మరి ఇందులో ఏమిటి?

ఈరోజుల్లో సినిమా బాగా ఆడటం, బాగుండటం రెండూ సవాల్‌తో కూడుకున్నవే. మంచి సినిమా తీస్తే ఆడదనే నమ్మకం పంపిణీదారుల్లో చాలా ఉంది. అలా కాదని నిరూపించడానికి కాస్త ధైర్యం కావాలి. బాలచందర్‌, విల్సన్‌ మాస్టర్‌లా అంత ధైర్యం ఉన్నవాళ్లు ఇప్పుడు చాలా తక్కువ.

'విక్రమ్‌'

యువ ప్రతిభావంతులతో కలిసి పనిచేశారు. ఆ అనుభవాల్ని పంచుకుంటారా?

ఇప్పుడు యువకులు కావొచ్చు, ఇంకో ఇరవయ్యేళ్ల తర్వాత వీళ్లే ఎంతో ఎత్తులో కనిపిస్తారు. లోకేశ్‌కి ఇది నాలుగో చిత్రం. భారతీరాజా నాతో తన తొలి సినిమాని చేశారు. భారతీరాజా, బాలు మహేంద్ర, బాలచందర్‌లతో ప్రయాణం గురించి ఆలోచిస్తే.. అప్పట్లో అందరం సరదాగా అనుకుని చేసేవాళ్లం. 'మరోచరిత్ర', 'వసంతకోకిల'.. వీటి గురించి ఇప్పుడు ఆలోచిస్తే వాళ్లు అప్పట్లోనే ఎంత సాహసం చేశారన్నది అర్థమవుతోంది.

మీ సినిమాలు మొదట్నుంచీ పలు భాషల్లో విడుదలవుతుంటాయి. ఇప్పుడేమో పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తోంది. దీనిపై మీ అభిప్రాయమేమిటి?

పాత చరిత్ర చూస్తే ఏఎన్నార్‌ 'దేవదాస్‌' తెలుగు వెర్షన్‌ చెన్నైలో మూడేళ్లు ఆడింది. 'మరోచరిత్ర' తెలుగు చిత్రంగానే రెండున్నరేళ్లు ఆడింది. 'శంకరాభరణం' అంతే. 'సాగరసంగమం' డబ్‌ అయ్యి అక్కడ సిల్వర్‌జూబ్లీ ఆడింది. 'స్వాతిముత్యం' అంతే. పాన్‌ ఇండియా ట్రెండ్‌ని బాలచందర్‌ ఎప్పుడో పరిచయం చేశారు. ఆయనకంటే ముందు ఏఎన్నార్‌ ఉన్నారు. భారతీయ సినిమా మేకింగ్‌ హబ్‌గా మాత్రం హైదరాబాద్‌ నిలిచే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదట్లో చెన్నై ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌ ఆ దిశగా ఎదుగుతోంది. నిర్మాత నాగిరెడ్డి తెలుగు సినిమాలొక్కటే చేయలేదు, 'మాయాబజార్‌' తెలుగు, తమిళం, 'రాముడు భీముడు', తెలుగు, తమిళం, హిందీ, ఇలా అన్ని సినిమాల్నీ ఒకే కంపెనీ చేసింది. ఏవీఎమ్‌ వాళ్లూ అంతే. 'చంద్రలేఖ' తొలి పాన్‌ ఇండియా సినిమా. ఈ సినిమా అప్పట్లో ఓ 'బాహుబలి'. ముంబయి నిర్మాతలు వేరే భాషల్లో సినిమాలు చేయలేదు. అదే దక్షిణాది నిర్మాతలు బెంగాలీలోనూ చేశారు. రామానాయుడు దాదాపుగా అన్ని భారతీయ భాషల్లో చేశారు. ఈ ట్రెండ్‌ అంతా కొత్తదేమీ కాదు.

కమల్‌హాసన్‌

ఓటీటీ పరంగా ఇంత విప్లవం వస్తుందని మీరు ముందే ఊహించారు..?

వచ్చి తీరాలి, వచ్చింది కూడా! ఇదే రావాలని నేను చెబితే అంతా నన్ను తప్పు పట్టారు. కొత్తదంటే మనకు ఎప్పుడూ ఓ రకమైన భయం. మార్పు కోసం ఏం చేసినా థియేటర్‌లో వచ్చే సినిమాని చూడటాన్ని మనందరం ఆస్వాదిస్తాం. ఇంట్లో వెంకటేశ్వర స్వామి క్యాలెండర్‌ ఉంటుంది, దానర్థం తిరుపతిలో రద్దీ తగ్గుతుందని కాదు. తిరుపతి వెళ్లి దర్శనం చేసుకోవడం ఓ అనుభవం. అలా సినిమా అనుభవం అనేది ఓ భాష. పక్కనున్నవాడు ఏ జాతి, ఏ మతం అని అడగకుండా సినిమాని ఆస్వాదిస్తాం. క్రీడల విషయంలోనూ అంతే. అందుకే కళలు, క్రీడలపై గొప్ప గౌరవం నాకు.

ఎవరైనా అడిగితేనే పాడతారా? లేక ఏమేం చేయగలమో అన్నీ చేద్దామనే తపనతో ఉంటారా?

చేసి తీరాలనే పట్టుదలేమీ ఉండదు. దర్శకులకి అనిపిస్తేనే చేస్తా. దర్శకులు కె.విశ్వనాథ్‌ అడిగినట్టు నన్నందరూ అడగరు కదా. 'సినిమా మొత్తం డ్యాన్స్‌ ఉంటుంది, పాటలుండవు, రొమాన్స్‌ తక్కువ. చేస్తావా?' అని అడిగారు. చేద్దామండీ అన్నా. అదే.. 'సాగరసంగమం' అయ్యింది.

పోస్టర్‌లో మీతోపాటు విజయ్‌, ఫహద్‌ ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఇంతకీ మీ ముగ్గురిలో 'విక్రమ్‌' ఎవరు?

సినిమా చూసి తెలుసుకోవల్సిందే. అది రహస్యం అని చెప్పను. టోపీలో నుంచి కుందేలు రావడం అసాధ్యం. కానీ వస్తుంది, అదే మేజిక్‌ అంటే! మాయాజాలికుడు ఎక్కడి నుంచి కుందేలుని తీసుకొస్తాడనేది చెప్పడంతే. అది వినోదాన్ని పంచడంలో భాగమే. కానీ ఆ కుందేలు ఎలా వస్తుందనేది తెలివైన ప్రేక్షకులకి కచ్చితంగా తెలుస్తుంది.

'భారతీయుడు2' ఎప్పుడు పూర్తి చేస్తారు?

శంకర్‌ వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. నేను 'విక్రమ్‌'పై దృష్టి పెట్టా. మా ఇద్దరి పనులు పూర్తి కాగానే 'భారతీయుడు2'ను తీసుకుంటాం.

రాజకీయాలు.. సినిమాలు ఎలా బ్యాలెన్స్‌ చేస్తున్నారు. దర్శకత్వంపై దృష్టి పెడతారా?

మనకి ఇదేం కొత్త కాదు. దక్షిణాదిలో సినిమా, రాజకీయం వేర్వేరు కాదు. మన పెద్దవాళ్లు రెండు రంగాల్లోనూ సమర్థంగా పనిచేశారు కదా. నేనూ అదే చేస్తున్నా. ఇక దర్శకత్వం అంటే నేను ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు. నేను దర్శకత్వం చేస్తే ఎక్కువ సినిమాల్లో నటించలేను. ప్రతిభావంతులైన కొత్త దర్శకులు వచ్చారు. వాళ్లతో పనిచేస్తే నాకున్న ప్రతిభ సద్వినియోగం అవుతుందనేది నా అభిప్రాయం.

.

సూర్య ఓ కీలక పాత్రని పోషించారు కదా. ఆయన ఎంపిక ఎలా జరిగింది?

చాలా చిన్న పాత్రే. అదొక అతిథి పాత్ర. మామూలుగా పుష్పగుచ్ఛాలు, అడ్వాన్సులు తీసుకెళ్లి హీరోల్ని బుక్‌ చేస్తుంటారు. సూర్య ఒక్క ఫోన్‌ కాల్‌తోనే చేయడానికి ఒప్పుకొన్నారు. తనని పాత్ర కోసం అడుగుదామని ఫోన్‌ చేశా 'ఏంటి, చెప్పండన్నయ్యా' అన్నారు. ఇలా ఓ పాత్ర ఉందనగానే చేస్తానన్నయ్యా అన్నారు. అది సూర్య గొప్పతనం. అతను ఎంత మంచి నటుడో చెప్పాల్సిన అవసరం లేదు. తనతో మా నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నం చేస్తున్నాం. మహేష్‌ నారాయణ్‌తోపాటు పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే మా కలయికలో చిత్రం ఉంటుంది. అది అందరూ మెచ్చేలా ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details