వైవిధ్యభరితమైన కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హీరో కమల్ హాసన్. ఎంత సాహసోపేతమైన పాత్రలోనైనా నటిస్తూ అందరిని మెప్పిస్తారు ఈ అగ్ర కథానాయకుడు. తాజాగా ఓ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ సినీ అభిమానుల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సినిమాల్లోకి వచ్చినప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.
"నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో తమిళ్‌లో "16 వయదినిలే" అనే సినిమాలో నటించాను. ఎప్పుడూ ఆ సినిమా ఆల్బమ్‌ను పట్టుకుని తిరిగేవాడిని. కనిపించిన అందరికీ 'నేను ఈ సినిమాలో హీరోగా నటించాను' అని చెప్పేవాడిని. కొందరు మంచిగా ప్రోత్సహించే వారు. మరికొందరు చులకనగా చూసేవారు. ఆ రోజులన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఇందాక ఇక్కడ ఉన్న ఒక గెస్ట్ మాట్లాడుతూ.. నేను సినిమా పెద్దదా, చిన్నదా అని చూడకుండా ఏ సినిమా ఫంక్షన్లకైనా హాజరవుతానని నన్ను ప్రశంసించారు. నిజానికి సినిమా స్థాయిని కేవలం అభిమానులు మాత్రమే నిర్ణయించగలరు" అని అన్నారు. ప్రేక్షకులను ఉద్దేశిస్తూ.."సినీ అభిమానులుగా ఎప్పుడూ మీపై పెద్ద బాధ్యత ఉంటుంది. మంచి చిత్రాలను బాగున్నాయని, మీరు ఆశించిన స్థాయిలో లేని వాటిని.. అంచనాలు అందుకోలేదని ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా చెప్పగలగాలి" అని కోరారు.