Bimbisara Baby: 'అఖండ', 'ఆర్ఆర్ఆర్' సినిమాల తరహాలోనే సోషియో ఫాంటసీగా వచ్చిన 'బింబిసార'లో కూడా పాప సెంటిమెంట్ ఉందన్న సంగతి తెలిసిందే. క్రూరమైన రాజైన బింబిసారుడు మంచిగా మారడానికి పాప పాత్రే కారణం! ఈ చిత్రంలో బింబిసారుడుకి, చిన్నారికి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా హత్తుకున్నాయి. ఓ సారి ఆ చిన్నారికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం...
చిన్న వయస్సులోనే వెండి తెరపై ఆరంగేట్రం చేసింది బేతంచెర్ల పట్టణానికి చెందిన శ్రీదేవి. మరోవైపు బుల్లి తెరపై నటిస్తూ ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పటి వరకు 10 చిత్రాలు, 15 టీవీ సీరియళ్లలో తన నటనతో పలువురిని మెప్పించింది. బుడిబుడి నడకలు, తడబడుతున్న మాటల వయస్సులోనే తన ప్రతిభతో మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇటీవల ఈటీవీలో ప్రారంభమైన యమలీల, ఆ తర్వాత సీరియల్లోనూ నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తోన్న చిన్నారి బేతంచెర్ల పట్టణానికి చెందిన శ్రీహరి గౌడ్, లక్ష్మి దంపతుల కుమార్తె.
శ్రీదేవి తండ్రి శ్రీహరి గౌడ్ గత కొంత కాలం క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ చిత్ర పరిశ్రమలో స్థిరపడి కంజుల ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. పలు సినిమాల్లో ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె శ్రీదేవి. ఈ చిన్నారి ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది.
నటించే అవకాశం ఇలా.. శ్రీహరి గౌడ్ 18 ఏళ్లుగా సినీ రంగంలో ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. జీ తెలుగు వారు పున్నాగ టీవీ సీరియల్ తీస్తున్న నేపథ్యంలో చిన్నారి పాత్ర అవసరం ఉండటంతో తన కూతురు శ్రీదేవిని వారికి పరిచయం చేశారు. మొదటగా పున్నాగ సీరియల్‌లో కథానాయకుడు, కథానాయికల కుమార్తెగా నటించే అవకాశం దక్కింది. ఆ సీరియల్‌లో నటిస్తుండగానే ప్రేమ, పౌర్ణమి, చెల్లెలి కాపురం, ముద్దమందారం, కల్యాణ వైభోగం.. ఇలా 15 టీవీ సీరియళ్లలో శ్రీదేవి బాలనటిగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న సరికొత్త ధారావాహిక యమలీల, ఆ తర్వాత బాలనటిగా పలు పాత్రలు పోషిస్తోంది. సీరియళ్లలోనే కాకుండా సినీరంగంలోనూ అద్భుతంగా నటిస్తూ తన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. మొదట 'ఆర్డీఎస్ లవ్' చిత్రంలో బాలనటిగా నటించింది. కథానాయిక పాయల్ రాజ్‌పుత్ చిన్నప్పటి పాత్రను శ్రీదేవి నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా తర్వాత 'సూపర్ మచ్చి'లోనూ రాజేంద్రప్రసాద్ కుమార్తెగా నటించింది. అడవి శేషు నటించిన చిత్రం 'మేజర్'లోనూ, రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ'లో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమాలో శార్వరిగా ప్రధాన పాత్ర పోషించింది. బాల నటిగా నటించి సినీ రంగంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది బాలనటి శ్రీదేవి.
మరిన్ని అవకాశాలు.. శ్రీదేవి ఇప్పటి వరకు 15 టీవీ సీరియళ్లు, 10 సినిమాల్లో నటించడమే కాకుండా మరికొన్నింటిలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇంకా మూడు సినిమాలు నటించనున్నట్లు ఆమె తండ్రి శ్రీహరి గౌడ్ తెలిపారు. ఈ చిన్నారి సినీ రంగంతోపాటు బుల్లి తెరపై, టీవీల్లో వచ్చే ప్రకటనల్లోనూ నటిస్తూ బేతంచెర్లకు కీర్తిప్రతిష్ఠలు తీసుకువస్తోంది.
ఇదీ చూడండి:ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఘనత.. వీరి చిత్రాలతోనే ఆ స్టార్ డైరెక్టర్ల కెరీర్ షురూ!