Kalyan Ram Devil Movie :నందమారి కల్యాణ్ రామ్ ప్రస్తుతం తన సోదరుడి సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపడుతూనే తన అప్‌కమింగ్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 'బింబిసార'తో మాసివ్ హిట్ అందుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు 'డెవిల్'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డిసెంబర్ 29న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం.
"నాకు ఈ కథ చాలా నచ్చింది. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నేను నటించలేదు. శ్రీకాంత్ నా దగ్గరకు స్టోరీ తీసుకురాగానే నేను కొన్ని మార్పులు చెప్పాను. ప్రత్యేకంగా ఎక్కడా ట్రైనింగ్ కూడా తీసుకోలేదు. స్టోరీ కోసం డైలాగులు చెప్పే విధానాన్ని మాత్రమే మార్చుకున్నాను. దీని కోసం రెండు సంవత్సరాల పాటు కష్టపడ్డాం. సినిమా చూసిన ఆడియెన్స్‌కు ఓ కొత్త కాన్సెప్ట్‌ను ఎంజాయ్ చేశామనే ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాకు సీక్వెల్ గురించి చర్చలు జరిగాయి. సినిమా రిజల్ట్ తర్వాత దాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాం. ప్రస్తుతానికి స్క్రిప్ట్ అయితే రెడీగా ఉంది." అంటూ సినిమా గురించి తన అభిప్రాయం తెలియజేశారు.
మరోవైపు ఈ సినిమాలో కోసం 90 కాస్ట్యూమ్స్ ఉపయోగించినట్లు ఆయన వెల్లడించారు. పాత్రకు తగ్గట్లుగా అలా కాస్ట్యూమ్స్ మార్చడం అవసరమని అందుకే అన్ని ఉపయోగించినట్లు ఆయన వెల్లడించారు. అవన్నీ కూడా ఇక్కడివి కావని. ఫ్రాన్స్, ఇటలీ నుంచి మెటీరియల్ తెప్పించి మరీ కుట్టించారంటూ ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.