బింబిసార లాంటి సూపర్ హిట్ తర్వాత నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో అషికా రంగనాథ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. జిబ్రాన్ సంగీతమందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా నేడు(ఫిబ్రవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ సినిమా చూసేందుకు అభిమానులు భారీగానే తరలివచ్చారు. ఇప్పటికే పలు చోట్ల అమిగోస్ ఫస్ట్ షో పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్‌లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా బాగానే ఉందని అంటున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించారు. సిద్దార్ధ్ అనే బిజినెస్ మెన్‌గా.. మంజునాథ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రలో, మైఖేల్ అనే గ్యాంగ్ స్టర్‌గా మూడు సరికొత్త పాత్రల్లో అలరించారు కల్యాణ్. అయితే ఈ ముగ్గురు ఒకరినొకరు ఎదురైన తర్వాత జరిగే సంఘటనలు ఆధారంగా సినిమా తెరకెక్కింది. అసలు ఈ ముగ్గురి మధ్య రక్త సంబంధం ఉందా..? లేక పోలికలు మాత్రమే కలిగి ఉన్నారా ? ముఖ్యంగా గ్యాంగ్ స్టర్ పాత్ర అయిన మైఖేల్... తనలా ఉండే ఆ ఇద్దరు పాత్రలను ఎలా ఉపయోగించుకున్నాడు.. తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కథ.