రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'అమిగోస్'. ఆషికా రంగనాథ్ కథానాయిక. కల్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ప్రచార చిత్రం నుంచే ఆసక్తి కలిగించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'అమిగోస్'కు సంబంధించిన విశేషాలు కల్యాణ్ రామ్ మీడియాతో పంచుకున్నారు.
'బింబిసార' సక్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
కల్యాణ్ రామ్: 'బింబిసార' సక్సెస్ జోష్‌తోనే 'అమిగోస్' తీశాను. ఏదైనా సినిమా హిట్ అయితే మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. దానితోపాటు బాధ్యత కూడా రెట్టింపవుతుంది. కొత్తగా ప్రయత్నిద్దాం అని అనుకుంటాం. నేను 'బింబిసార', 'అమిగోస్', 'డెవిల్' ఈ మూడు కథలు 2020లోనే ఓకే చేశాను. అమిగోస్ కథ వినగానే కొత్తగా అనిపించింది. అందుకే వెంటనే ఓకే చేశాను. సాధారణంగా సినిమాలో ట్రిపుల్ రోల్ అంటే కనీసం ఇద్దరు హీరోయిన్‌లైనా ఉంటారు. కానీ 'అమిగోస్' పూర్తి విభిన్నమైన సినిమా. ఇందులో ఒక్క హీరోయిన్ మాత్రమే ఉంటుంది. విలన్ కూడా ఉండడు. ఒకే పోలికలతో ఉండే ముగ్గురు వ్యక్తులు ఎలా కలిశారు. వాళ్లకేం కావాలి.. ఇలా సినిమా అంతా ఆసక్తిగా ఉంటుంది.
'అమిగోస్' అనే టైటిల్‌నే ఎందుకు పెట్టారు?
కల్యాణ్ రామ్: ఈ సినిమాలో ముగ్గురి పాత్రలు కీలకమైనవే. అలాంటప్పుడు ఎవరో ఒకరి పేరు సినిమాకు పెట్టడం కరెక్ట్ కాదు. ఫ్రెండ్‌షిప్‌నకు సంబంధించిన టైటిల్ పెట్టాలని నిర్ణయించాం. అలా అని రోటీన్‌గా కాకుండా కొత్తగా ఉండాలనుకున్నాం. సోషల్‌మీడియాలో అమిగో అనే హ్యాష్‌ట్యాగ్ చూశాను. నచ్చింది. ఈ సినిమాకు కూడా సరిపోతుందనిపించింది. దాని అర్థం ఎవరికీ తెలియదు అని ఎందుకు అనుకోవాలి. 'కాంతార' సినిమా వచ్చేవరకు ఆ పేరు అర్థం ఎవరికీ తెలీదు కదా!
'అమిగోస్' ఎలాంటి సినిమా.. కమర్షియల్ సినిమానా లేక ప్రయోగాత్మకమైనదా?
కల్యాణ్ రామ్: నేను తీసిన సినిమాల్లో కమర్షియల్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. 'బింబిసార' కూడా పాత కథే. కానీ ఆ కథను చూపించే విధానంపై సినిమా ఆధారపడి ఉంటుంది. 'అమిగోస్' సినిమా 2 గంటల 19 నిమిషాలు ఉంటుంది. అందులో రెండు గంటల పదిహేడు నిమిషాలు కల్యాణ్‌రామ్‌నే చూస్తారు. అంత ప్రాధాన్యం ఉంటుంది. మా కుటుంబంలో నుంచే త్రిపాత్రాభినయం సినిమాలు ఎక్కువగా వచ్చాయని అనుకుంటున్నారు. కానీ గతంలో చాలా మంది హీరోలు ట్రిపుల్ రోల్ సినిమాలు చేశారు. మా కుటుంబంలో హీరోలకు ఇలాంటి కథలు రావడం మా అదృష్టం.
'బింబిసార' నుంచి మీ కథల ఎంపికలో మార్పు వచ్చిందా?
కల్యాణ్ రామ్: అసలు ఆ సినిమా తర్వాత నేను ఏ కథనూ ఓకే చెయ్యలేదు. ఇవన్నీ దానికి ముందు రెడీ చేసుకున్నవే. నేను 'బింబిసార' ముందు ఎలా ఉన్నానో తర్వాత కూడా అలానే ఉన్నాను. ఏ సినిమా అంగీకరించినా.. ఆ పాత్ర గతంలో ఏ హీరో చెయ్యనిదై ఉండాలనుకుంటా. ఈ ఒక్క విషయాన్ని మాత్రం కచ్చితంగా చూస్తాను. అమిగోస్‌లో విలన్‌లా నటించడం చాలా కొత్తగా అనిపించింది. కొవిడ్ టైంలో నన్ను నేను బాగా తెలుసుకున్నాను. నేను చేసిన కొన్ని సినిమాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి అని ఆలోచించాను. నేను చేసిన తప్పులు ఏంటి అని తెలుసుకున్నాను. అమిగోస్ మేకింగ్ ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపించింది.