Motion Pictures Academy: ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు వేడుకలను ఏటా ఘనంగా నిర్వహించే మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అకాడమీ.. కొత్త సభ్యులుగా పలువురు భారతీయ నటులు ఎంపికయ్యారు. వీరిలో బాలీవుడ్ నటి కాజోల్, కోలీవుడ్ హీరో సూర్య చోటుదక్కించుకున్నారు. వీరితో పాటు మొత్తం 397 మంది కళాకారులు, ఇతర సాంకేతిక నిపుణులు ఉన్నారు.
కొత్త సభ్యులుగా ఎంపికైన వారి పేర్లతో కూడిన జాబితాను అకాడమీ బోర్డు మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఇందులో యాక్టర్లు, థియేట్రికల్ మోషన్ పిక్చర్స్‌లో వివిధ విభాగాల్లో పనిచేసిన సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు ఉన్నారు. వృత్తిపరమైన అర్హతల ఆధారంగా సభ్యులను ఎంపిక చేశామని అకాడమీ ప్రకటించింది. 2022లో 44 శాతం మంది మహిళలు, 37 శాతం తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వారిని, 50 శాతం యూఎస్ఏకు వెలుపల 53 దేశాలకు చెందినవారిని తీసుకున్నట్లు వెల్లడించింది.
Motion Pictures Academy Suriya Kajol: 'మై నేమ్ ఈజ్ ఖాన్', 'కబీ ఖూషీ కబీ గమ్' లాంటి హిందీ సూపర్ హిట్లను సొంతం చేసుకున్న కాజోల్, 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరో సూర్యను అకాడమీ ఆహ్వానించింది. ఈ సంవత్సరం ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో నామినేట్ అయిన 'రైటింగ్ విత్ ఫైర్' తెరకెక్కించిన సుస్మిత్ ఘోష్, రింటూ థామస్ లాంటి వారు కూడా ఉన్నారు. తలాష్, గల్లీబాయ్, గోల్డ్ లాంటి హిందీ చిత్రాలతో పాపులర్ అయిన కగ్టీ కూడా రచయితల జాబితాలో ఎంపికయ్యారు.