తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నటుడిగా మారిన 'కచ్చా బాదం' సింగర్​.. రెమ్యునరేషన్​ ఎంతంటే? - కచ్చా బాదం సింగర్​ భుబన్ కష్టాలు

'కచ్చా బాదం' సాంగ్​తో ఫేమస్​ అయిన భువన్ బద్యాకర్.. ఇప్పుడు నటుడిగా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. ఆ వివరాలు..

Kacha badam
నటుడిగా మారిన 'కచ్చా బాదం' సింగర్​.. రెమ్యునరేషన్​ ఎంతంటే?

By

Published : Apr 4, 2023, 6:47 AM IST

సోషల్‌మీడియా.. ఎప్పుడు, ఎవర్ని సెలబ్రిటీగా మారుస్తుందో తెలీదు. అస్సలు ఊహించలేం. అలా అనుకోకుండా ఓవర్​నైట్​ స్టార్​గా క్రేజ్‌ సంపాదించిన వారు ఎంతో మంది. ఆ జాబితాలోకే వస్తారు 'కచ్చా బాదం' సింగర్‌ భువన్ బద్యాకర్. తన వ్యాపారం కోసం స్వయంగా పాట రాసుకుని, ఆలపించిన ఆయన ఓవర్‌నైట్‌ స్టార్‌ ఎదిగారు. ఎక్కడ చూసినా ఆయన పాడిన పాటే వినిపించేది, కనిపించేది. సోషల్​మీడియాను షేక్ చేసింది. నెటిజన్లనే కాదు.. సెలబ్రిటీలు కూడా స్టెప్పులేస్తూ ఆ సాంగ్​ను ఫుల్​ ఎంజాయ్ చేశారు. రీల్స్​ చేస్తూ వీడియోలను తెగ షేర్ చేశారు. అలా ఈ ఒక్క సాంగ్​.. వీధుల్లో తిరుగుతూ పల్లీలు అమ్ముకునే వీధి వ్యాపారి భువన్​ను స్టార్​గా మార్చి ఆయన లైఫ్​నే ఛేంజ్​ చేసింది.

అయితే ఇప్పుడాయన నటుడిగా కొత్త జర్నీని మొదలుపెట్టారు. బెంగాలీ సీరియల్‌లో ఓ అమ్మాయికి తండ్రిగా నటించారు. ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి నిర్ణయాన్ని తిరస్కరించే తండ్రి పాత్రలో ఆయన స్మాల్ స్క్రీన్​ ఆడియెన్స్​ను అలరించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ కూడా పూర్తయింది. రెండు రోజులపాటు షూటింగ్​లో పాల్గొనగా ఆయనకు రూ. 40 వేల రెమ్యునరేషన్​ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో నటుడు కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తే తప్పకుండా యాక్ట్​ చేస్తానని అన్నారు.

స్టార్‌ హోదా తెచ్చిన కష్టాలు.. పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా కురల్జూరి గ్రామాంలో ఉండేవారు భువన్ బద్యాకర్. ఆయన పల్లీలు అమ్ముకునే ఓ వీధి వ్యాపారి. అలా స్వయంగా తాను రాసిన కచ్చా బాదం పాటను ఆలపిస్తూ పల్లీలను అమ్ముకునేవారు. అయితే ఓ సందర్భంలో ఆయన ఆలపిస్తుండగా.. ఓ వ్యక్తి ఫోన్‌లో షూట్​లో చేసి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆ వీడియో కొన్ని గంటల్లోనే తెగ వైరల్‌ అయిపోయింది. మన దేశంతో పాటు విదేశాల్లోనూ విశేష గుర్తింపు పొందింది. ఇక భువన్​ సోషల్​మీడియా స్టార్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఓ కంపెనీ అతడితో ఒప్పందం కుదుర్చుకుని కచ్చా బాదం ఆల్బమ్​ను రూపొందింది. ఇది అతడిని మరింత ఫేమస్ చేసింది. దీంతో ఆయన తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చేశారు.

ఈ క్రమంలోనే సోషల్​మీడియా సెలబ్రిటీగా పలు టెలివిజన్‌ కార్యక్రమాలు, మ్యూజిక్‌ వీడియోల్లో మెరిసేవారు. అలా స్టార్‌గా మారిన తర్వాత తనకు వచ్చిన డబ్బుతో కారు కూడా కొనుక్కున్నారు. కానీ కారు నేర్చుకునే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. మరోవైపు అడిగినవారికల్లా అప్పు, విరాళం పేరుతో తన గ్రామస్థులకు డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్లిపోయారు. కానీ తిరిగి వసూలు చేయలేకపోయారు. ఈ క్రమంలోనే కొందరు యువకుల వేధింపులు భరించలేని ఆయన.. తన స్వగ్రామాన్ని వదిలేసి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామానికి షిప్ట్ అయిపోయారు. అద్దె ఇంట్లో భార్యాపిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు.

"కచ్చా బాదం నన్ను ఫుల్​ పాపులర్‌ చేసింది. కానీ ఇప్పుడు దాని వల్లే నేను నా సొంత ఇంటికి దూరమయ్యాను" అని భువన్‌ ఓ సందర్భంలో తన బాధను చెప్పుకున్నారు. ఓ కంపెనీ డబ్బు ఆశ చూపి కాపీ రైట్​ పేరుతో తనను మోసం చేసిందని విచారం వ్యక్తం చేశారు. దీంతో తన కచ్చా బాదం పాటను పాడేందుకు, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు ఛాన్స్​ లేకుండా పోయిందని చాలా బాధ పడ్డారు. మరి ఇన్ని మోసాలు, కష్టాల తర్వాత అద్దె ఇంట్లో జీవనం సాగిస్తన్న భువన్... ఈ కొత్త జర్నీ(నటన) తనను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేస్తుందని ఆశతో బుల్లితెరపై మెరవనున్నారు.

ఇదీ చూడండి: కీర్తి సురేశ్ తీన్మార్ స్టెప్పులు చూశారా?.. రెచ్చిపోయిందిగా!

ABOUT THE AUTHOR

...view details