67వ కర్ణాటక రాజ్యోత్సవం సందర్భంగా దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌ను సన్మానించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బెంగళూరులో భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారమైన 'కర్ణాటక రత్న'తో పునీత్ రాజ్‌కుమార్‌ను సత్కరించింది. పునీత్ తరఫున ఆయన భార్య ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కన్నడలో అనర్గళంగా మాట్లాడి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. నటుడిగా తాను సాధించిన విజయాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని.. పునీత్ రాజ్‌కుమార్ స్నేహితుడిగా ఇక్కడికి వచ్చానని అన్నారు. "కుటుంబం నుంచి వారసత్వం, ఇంటిపేరు మనకు వస్తాయి. కానీ వ్యక్తిత్వాన్ని సొంతంగా సంపాదించుకోవాలి. అహం, అహంకారం అనేవి లేకుండా తన వ్యక్తిత్వం, చిరునవ్వుతో మొత్తం రాష్ట్రాన్ని గెలుచుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పునీత్ రాజ్‌కుమార్ మాత్రమే" అని కొనియాడారు.
"ఆయన కర్ణాటక పీపుల్స్ సూపర్ స్టార్. గొప్ప కొడుకు, గొప్ప భర్త, గొప్ప తండ్రి, గొప్ప స్నేహితుడు, గొప్ప డ్యాన్సర్, సింగర్... వీటన్నింటికీ మించి ఆయన గొప్ప మనిషి. ఆయన నవ్వులాంటి సంపద మరెక్కడా దొరకదు. అందుకే ఆయన చిరునవ్వుల రారాజు అంటారు. అందుకే ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు దక్కించుకొని కర్ణాటక రత్న అన్న పదానికి నిర్వచనం చెప్పారాయన" అని జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగించారు.
ఇదే కార్యక్రమంలో మాట్లాడిన సూపర్‌స్టార్ రజనీకాంత్.. వర్షం పడుతున్న కారణంగా చిన్న ప్రసంగాన్ని ఇవ్వలనుకుంటున్నానని తెలిపారు. ఈ వర్షంలో ప్రజలను వేచి ఉంచడం తనకు ఇష్టం లేదని అన్నారు. "కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసి శాంతి, సామరస్యాలతో ఆనందంగా జీవించాలి. అందుకు రాజరాజేశ్వరి, అల్లా, జీసస్‌ల ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను" అని రజనీకాంత్ కర్ణాటక రాజ్యోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పునీత్ రాజ్‌కుమార్‌ను అనేక పురాణ పాత్రలతో పోల్చిన రజనీ.. ఆయన "దేవుని బిడ్డ" అని కొనియాడారు. "కలియుగంలో అప్పు.. మార్కండేయ, ప్రహ్లాద, నచికేత లాంటివారు. ఆయన దేవుని బిడ్డ. ఆ బిడ్డ కొంత కాలం మన మధ్య జీవించారు. మనతో ఆడుకున్నారు. అందరినీ నవ్వించారు. మళ్లీ ఆ బిడ్డ దేవుడి దగ్గరికి వెళ్లారు. కానీ అతని ఆత్మ మనతోనే ఉంది" అని రజనీకాంత్ పేర్కొన్నారు.