Jr NTR Japan Earthquake:జపాన్ ఇషివాకాలో సోమవారం సంభవించిన వరుస భూకంపాల పట్ల పాన్ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల ఫ్యామిలీతో జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ వారం రోజులు అక్కడే గడిపి, సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే భూకంపం గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ ట్విట్టర్లో సానుభూతి తెలిపారు. 'జపాన్ నుంచి ఈరోజే ఇంటికి వచ్చాను. భూకంపం గురించి తెలియగానే షాకయ్యా. మేం సేదతీరిన ప్రాంతంలో భూకంపం రావడం నా హృదయాన్ని కలిచివేసింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా. స్టే స్ట్రాంగ్ జపాన్' అని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇక ఎన్టీఆర్ ఇటీవల 'దేవర' షూటింగ్‌తోపాటు, న్యూ ఇయర్ వేడుకలకు జపాన్ వెళ్లారు. అక్కడ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక, ఫ్యామిలీతో ఎన్టీఆర్ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొని తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. కాగా, ఈ భూకంప ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
జపాన్ ఇషివాక సముద్ర ప్రాంతంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. సోమవారం ఐదు గంటల వ్యవధిలో మొత్తం 50సార్లు భూప్రకంపనలు వచ్చాయి. పలు పాంత్రాలను 5 మీటర్ల ఎత్తులో అలలు తాకినట్లు అధికారులు తెలిపారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తీర ప్రాంత రాష్ట్రాలైన ఇషికావా, నీగట, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్ ప్రభుత్వం సూచించింది.