Ram Charan Baby : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోషన్ తీసుకున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తన మనవరాలు పుట్టిన ఆనందంలో మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. పలువురు సినీ సెలబ్రిటీల సైతం చెర్రీ - ఉప్సీలకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ప్రాణ స్నేహితుడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చెర్రీ దంపతులకు ట్వీటర్ వేదికగా విషెస్ చెబుతూ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం పలికారు.
"రామ్ చరణ్- ఉపాసన మీకు నా శుభాకాంక్షలు. పెరేంట్స్ క్లబ్‌లోకి మిమల్ని ఆహ్వానిస్తున్నాను. పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆడబిడ్డతో గడిపే ప్రతిక్షణం జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ప్రపంచంలోకి కొత్తగా అడుగుపెట్టిన చిన్నారితో పాటు మీ కుటుంబంపై ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను." అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
'మరో లక్ష్మీ దేవీ వచ్చిందోచ్..!'
ఇక మెగా ఫ్యామిలీలో కోడలిగా అడుగు పెట్టబోతున్న లావణ్య త్రిపాఠి రామ్ చరణ్- ఉపాసనలకు శుభాకాంక్షలు తెలిపారు. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా చెర్రీ దంపతులకు తన విషెస్‌ను చెప్పారు. మరోవైపు మంచు కుటుంబం నుంచి హీరో మంచు మనోజ్ అభినందనలు తెలియజేయగా.. మరో లక్ష్మీ దేవి పుట్టిందన్న వార్త విని చాలా ఆనందం వేసింది అంటూ మంచు లక్ష్మీ ప్రసన్న రామ్ చరణ్- ఉపాసనలకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.
షెడ్యూళ్లు వాయిదా..
Ram Charan Movies : ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఇద్దరు కలిసి ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు గెలిచిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. ఇందులోని నాటు నాటు పాట చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరినీ ఉర్రూతళూగించింది. ఈ సినిమాతో చెర్రీ, ఎన్టీఆర్‌లు గ్లోబల్ రేంజ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న 'గేమ్ ఛేంజర్'లో యాక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పెళ్లైన 11 ఏళ్లకు పండంటి బిడ్డకు తండ్రైన ఆనందంలో రామ్‌చరణ్ ఫ్యామిలీతో గడిపేందుకు కొద్దిరోజుల పాటు తన మూవీ షెడ్యూల్స్‌ను అన్నింటినీ వాయిదా వేసుకుంటున్నట్లు సమాచారం.