Jeevitha rajasekhar emotional on Fake news: తెలుగు చిత్ర పరిశ్రమ పాలిట పలు సామాజిక మాద్యమాలు శాపంగా మారాయని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఆవేదన వ్యక్తం చేసింది. వాటిని కట్టడి చేసి నటీనటుల వ్యక్తిగత గౌరవాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు చేపట్టబోతున్నట్లు వాణిజ్య మండలి ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో సమావేశమైన పలువురు దర్శక నిర్మాతలు... సామాజిక మాద్యమాల్లో వస్తోన్న అవాస్తవాలను తీవ్రంగా ఖండించారు. దర్శక నిర్మాతలు ఆది శేషగిరిరావు, జీవిత రాజశేఖర్, వీఎన్ ఆదిత్య, ఎన్. శంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, మాదాల రవి, కాశీ విశ్వనాథ్ సహా ఇతర సినీ ప్రముఖులు హాజరై సామాజిక మాద్యమాల్లో విష ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినిమా వాళ్లంటే ఎందుకు అంత చులకనా అని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. నెగిటివ్ పబ్లిసిటీ చేసి క్యాష్ చేసుకోవాలనే తీరును మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సామాజిక మాద్యమాల్లో తప్పుడు కథనాల వల్ల 25 ఏళ్లుగా తన కుటుంబం ఎంతో వేదన అనుభవిస్తుందని జీవిత రాజశేఖర్ వాపోయారు. తన కుమార్తెలపై అశ్లీలంగా, అసభ్యకరంగా థంబ్నెయిల్స్పై పెట్టి ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన జీవిత రాజశేఖర్... నిర్మాతల మండలి ఈ విషయంపై కఠినంగా వ్యవహారించాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాపై నియంత్రణకు ఫిల్మ్ చాంబర్ తీసుకునే నిర్ణయాలకు దర్శకుల సంఘం కట్టుబడి ఉంటుందని ఆ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న కాశీ విశ్వనాథ్ తెలిపారు.