Jawan Oscar : కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'జవాన్' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన విషయమే. ఈ చిత్రం రిలీజై 12 రోజులైనా ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ కోట్ల రూపాయలను వసూలు చేస్తోంది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూళ్లు చేస్తూ.. రూ. 1000 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడీ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ వరకు తీసుకెళ్లాలని డైరెక్టర్ అట్లీ ఆశ పడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. తాను తెరకెక్కించిన 'జవాన్' మూవీ ఆస్కార్ అకాడెమీకి వెళ్లాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. షారుక్ ఖాన్‌తోనూ ఈ విషయం గురించి మాట్లాడతానని అన్నారు.
సాధారణంగా ఓ చిత్రం భారీ రేంజ్లో సక్సెస్ సాధిస్తే.. ఏ దర్శకుడైన ఇలా ఆలోచించడం మాములే. కాబట్టి దర్శకుడు అట్లీ కూడా జవాన్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఆస్కార్ కల కనడంలో తప్పేమీ కనిపించడం లేదు. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి.. జవాన్ చిత్రానికి ఆస్కార్ రేంజ్ స్థాయికి వెళ్లే అర్హత ఉందా లేదా? అనేది.. ఎందుకంటే 'జవాన్' అనేది ఓ పక్కా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. సమాజంలోని తప్పు ఒప్పులను ఎత్తి చూపిస్తూ, వాటిని సరిదిద్దటానికి ప్రయత్నం చేసే ఓ వ్యక్తి ఎమోషనల్ జర్నీ. సామాజిక, రాజకీయ అంశాలను లేవెనెత్తుతూ ఒక నార్మల్ పక్కా కమర్షియల్‌గా సినిమాను తీశారు.