తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Jawan Movie Telugu Review : 'జవాన్​'లో అన్ని షేడ్స్​.. షారుక్​ ప్రేక్షకులను మెప్పించారా ? - షారుక్​ ఖాన్​ జవాన్​ మూవీ తెలుగు రివ్యూ

Jawan Movie Telugu Review : బాలీవుడ్​ బాద్​షా షారుక్‌ఖాన్‌, నయనతార లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'జవాన్‌'. గురువారం థియేటర్లలో గ్రాండ్​గా రిలీజైన ఈ సినిమా ఎలా ఉందంటే ?

Jawan Movie Telugu Review
Jawan Movie Telugu Review

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 1:57 PM IST

Updated : Sep 7, 2023, 2:57 PM IST

Jawan Movie Telugu Review : చిత్రం: జవాన్‌; నటీనటులు: షారుక్‌ ఖాన్‌, నయనతార, దీపిక పదుకొణె, విజయ్‌ సేతుపతి, సునీల్‌ గ్రోవర్‌, ప్రియమణి, సాన్య మల్హోత్ర, యోగిబాబు తదితరులు; సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు; సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌; నిర్మాతలు: గౌరీ ఖాన్‌, గౌరవ్‌వర్మ; ఎడిటింగ్‌: రుబెన్‌; స్క్రీన్‌ప్లే: రమణ గిరివసన్‌; కథ, దర్శకత్వం: అట్లీ; విడుదల: 07-09-2023

'ప‌ఠాన్‌' సినిమాతో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​.. ఈసారి 'జ‌వాన్‌'గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. తాజాగా విడుదలైన ట్రైలర్​తో ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్న ఆడియెన్స్​.. ఎప్పుడెప్పుడు రిలీజ్​ అవుతుందా అంటూ ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూశారు మ‌రి సినిమా ఎలా ఉందంటే?

స్టోరీ ఏంటంటే : గుండుతో క‌నిపించే ఓ అజ్ఞాత వ్య‌క్తి (షారుక్‌ ఖాన్‌) త‌న గ్యాంగ్‌లోని ఆరుగురు అమ్మాయిలతో క‌లిసి ముంబయిలోని మెట్రో రైల్‌ని హైజాక్ చేస్తాడు. గవర్నమెంట్​ను రూ.40 వేల కోట్లు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తాడు. అందులో భాగంగా ప్ర‌యాణికుల ప్రాణాల్ని తీయ‌డానికి కూడా వెన‌కాడ‌డు. ఈ క్రమంలో హైజాక‌ర్ల‌ని ప‌ట్టుకోవ‌డం కోసం ఐపీఎస్ న‌ర్మ‌ద (నయన్​తార)ని రంగంలోకి దింపుతుంది అధికార యంత్రాంగం. అయినా తాను అనుకున్న‌ది సాధించి చాక‌చ‌క్యంగా త‌ప్పించుకుంటాడు. అయితే త‌న‌కిచ్చిన రూ.40వేల కోట్ల‌ని పేద‌ల ఖాతాల్లో జ‌మ చేస్తాడు. దీంతో న‌యా రాబిన్‌హుడ్‌లాంటి ఆ హైజాక‌ర్ వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారుతుంది.

న‌ర్మ‌ద‌, త‌న బృందం సాగించిన ప‌రిశోధ‌న‌లో హైజాక‌ర్... ఓ జైల్​లో విధులు నిర్వ‌ర్తించే జైల‌ర్ ఆజాద్ (షారుక్‌ ఖాన్) పోలిక‌ల‌తో ఉన్న‌ట్టు తేలుతుంది. దీంతో జైల‌ర్ ఆజాద్ హైజాక‌ర్‌గా మారాడా? ఆయ‌న వెంట ఉన్న ఆరుగురు యువ‌తులు ఎవ‌రు? ఒక‌ప్పుడు ఆర్మీలో ప‌నిచేసిన విక్ర‌మ్ రాథోడ్ (షారుక్‌ ఖాన్‌)కీ, ఆజాద్‌కీ ఉన్న సంబంధం ఏంటి? ప‌్ర‌పంచంలో ఐదో అతి పెద్ద ఆయుధాల వ్యాపారి కాళీ గైక్వాడ్ (విజ‌య్ సేతుప‌తి) క‌థేంటి? అవన్నీ మిగతా కథలో చూడాల్సిందే.

ఎలా ఉందంటే: సౌత్​లో ముఖ్యంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లోని అగ్ర తార‌ల సినిమా లాగే హీరోయిజం... వీరోచిత‌మైన పోరాటాలు, సోషల్​ ఎలిమెంట్స్​, అభిమానుల్ని మెప్పించే ఇత‌ర‌త్రా మాస్ అంశాల మేళవింపుగా రూపొందుతుంటాయి. క‌థ కాస్త ఆస‌క్తిక‌రంగా సాగిందంటే చాలు... ఇక ఆ సినిమాల‌కి ఆకాశ‌మే హ‌ద్దుగా చెలరేగుతుంటాయి. ఇక అలాంటి ఓ క‌థ‌లోనే బాలీవుడ్ బాద్‌షా షారుక్​ను చూపించారు అట్లీ. ఆయ‌న‌కు షారుక్‌ ఇమేజ్‌, మార్కెట్ మ‌రింత‌గా క‌లిసి రావ‌డం వల్ల సినిమాకు అదనపు హంగులు జోడించి తెర‌కెక్కించారు. దాంతో ప్ర‌తి సీన్​ లార్జ‌ర్ దేన్ లైఫ్ త‌ర‌హాలో ఉంటుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. ఇది అట్లీ మార్క్ హిందీ సినిమా.

Sharukh Khan Jawan Review : మరోవైపు షారూక్‌ఖాన్ ఎప్పుడూ క‌నిపించ‌నంత మాస్‌గా... వైవిధ్యమైన గెట‌ప్స్​లో క‌నిపించ‌డం ఆయ‌న అభిమానుల‌కి మ‌రింత ఉత్సాహాన్నిస్తుంది. ఎప్ప‌ట్లాగే అట్లీ ప‌లు పార్శ్వాల‌తో కూడిన స్టోరీని రాసుకున్నాడు. దాదాపుగా కీల‌క‌మైన ప్ర‌తి పాత్ర‌కీ ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. వాటిని తెలుసుకోవాల‌నే ఉత్సుక‌త‌ని ప్రేక్ష‌కుల్లో క‌లిగిస్తూ క‌థ‌ని ముందుకు న‌డిపించాడు. 'నేనెవ‌ర్ని'? అనిపిస్తూ షారూక్‌ని ప‌రిచ‌యం చేసిన అట్లీ, ఆ వెంట‌నే హైజాక్ ఎపిసోడ్‌తో క‌థని మొద‌లుపెట్టాడు. షారుక్‌ మార్క్ వినోదం ఏమాత్రం త‌గ్గ‌కుండా... ప్ర‌భుత్వాల్ని ప్ర‌శ్నించేలా కొన్ని ఎపిసోడ్స్‌ని తీర్చిదిద్దుతూ బ్యాలెన్సింగ్‌గా క‌థ‌ని చెప్పాడు ద‌ర్శ‌కుడు.

ఇక వ్య‌వ‌సాయశాఖ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి నేప‌థ్యంలో వ‌చ్చే ప్రతి ఎపిసోడ్​ ఫస్ట్​ హాఫ్​కు హైలైట్‌. ఓ వైపు ఆజాద్‌ని ప‌ట్టుకోవ‌డం కోసం ప్ర‌య‌త్నాలు.. మ‌రోవైపు లవ్​ సీన్స్​ ఈ రెండూ మంచి డ్రామాని పండించాయి. ఇక ఇంటర్వెల్​ సీన్స్ సినిమాను మరో రేంజ్​కి తీసుకెళ్లాయి. విక్ర‌మ్ రాథోడ్‌గా షారూక్‌ఖాన్ ప‌రిచ‌యం కావ‌డం, ఆ వెంట‌నే మొద‌ల‌య్యే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి కీల‌కంగా నిలిచింది. షారూక్‌- దీపికా ప‌దుకొణే మ‌ధ్య వచ్చే సీన్స్​ త‌క్కువే అయినప్పటికీ.. సినిమాపై బ‌ల‌మైన ప్ర‌భావం చూపిస్తాయి.

దీపికా ఓ బిడ్డ‌కి జన్మ‌నిచ్చి, పెంచి పెద్ద చేసే స‌న్నివేశాలు, త‌న‌ని వ‌దిలిపెట్టి వెళ్లే స‌న్నివేశాలు ప్రేక్షకుల చేత క‌న్నీళ్లు పెట్టిస్తాయి. ఆయుధాల ఎపిసోడ్స్‌కి సంబంధించి షారుక్‌, విజ‌య్ సేతుప‌తి మ‌ధ్య స‌న్నివేశాలు కూడా ఆడియెన్స్​ను అల‌రిస్తాయి. సెకండాఫ్‌లో ఈవీఎమ్ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు చిత్రానికి మరో హైలైట్‌. షారుక్​ క‌నిపించిన‌ప్పుడల్లా అభిమానులు చ‌ప్ప‌ట్లు కొట్టేలా హీరోయిక్‌గా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు.

మరోవైపు ప‌తాక స‌న్నివేశాలు, పోరాట ఘ‌ట్టాలు మాత్రం పైసా వ‌సూల్. అక్కడ ద‌ర్శ‌కుడు లాజిక్‌ల‌ని ప‌ట్టించుకోలేదు. కొన్ని స‌న్నివేశాలు అయితే మ‌రీ డ్ర‌మాటిక్‌గా అనిపిస్తాయి. కానీ మాస్ మ‌సాలా సినిమాల్లో అలాంటి లెక్క‌ల్ని ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేద‌న్న‌ట్టుగా అట్లీ త‌నదైన శైలిలో స‌న్నివేశాల్ని తీర్చిదిద్దుతూ వెళ్లారు. షారూక్‌ అభిమానుల‌కి కావ‌ల్సినంత సంద‌డిని పంచే ఈ సినిమా... మాస్ మ‌సాలా సినీ లవర్స్​కు మంచి కాల‌క్షేపాన్నిస్తుంది. 'హ్యాపీ ఓన‌మ్' అంటూ మాధ‌వ‌న్ నాయ‌ర్ పాత్ర‌లో సంజ‌య్ ద‌త్ చేసిన సంద‌డి సినిమాలో కొస‌మెరుపు.

ఎవ‌రెలా చేశారంటే: షారుక్‌ ఖాన్ మాస్ లుక్​ అద‌ర‌హో అనిపిస్తుంది. ఆయ‌న రెండు కోణాల్లో సాగే పాత్ర‌లో చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. ర‌క‌ర‌కాల గెట‌ప్స్​లో ఒదిగిపోయిన తీరు కూడా మెప్పిస్తుంది. పాట‌లు, పోరాట ఘ‌ట్టాల్లో ఎప్ప‌ట్లాగే అద‌ర‌గొట్టిన షారుక్‌... సామాజికాంశాలు, కుటుంబం నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లోనూ ఆయ‌న న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఇక న‌య‌న‌తార ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ క‌నిపిస్తుంది. కీల‌క‌మైన పాత్రే అయినప్పటికీ... షారుక్‌కీ, ఆమెకీ మ‌ధ్య కెమిస్ట్రీ అంత‌గా ఎలివేట్‌ కాలేదు. ఆ నేప‌థ్యంలో ఎక్కువ సీన్స్​ లేక‌పోవ‌డ‌మే అందుకు కార‌ణమేమో. అయితే దీపికా మాత్రం ఉన్నంత‌లో త‌న‌దైన ప్ర‌భావం చూపించింది.

Jawan Movie Cast : కాళీ గైక్వాడ్‌గా విజ‌య్ సేతుప‌తి ద్వితీయార్ధంపై ప్ర‌భావం చూపిస్తారు. సాన్య మ‌ల్హోత్రా, ప్రియ‌మ‌ణి, రిద్ధి, సంజీత త‌దిత‌రులకి కీల‌క‌మైన పాత్ర‌ల‌కి ద‌క్కాయి. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. అనిరుధ్ పాట‌ల కంటే కూడా నేప‌థ్య సంగీతంతో షారూక్‌ హీరోయిజాన్ని మ‌రోస్థాయికి తీసుకెళ్లాడు. విష్ణు కెమెరా ప‌నిత‌నం టాప్‌నాచ్‌ అని చెప్పవచ్చు. యాక్ష‌న్‌, ఎడిటింగ్‌, మేక‌ప్, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ విభాగాలు కూడా స‌త్తా చాటాయి. అట్లీ క‌థ కంటే కూడా క‌థ‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ప‌లు పార్శ్వాలతో కూడిన ఈ క‌థ‌ని ఎంతో స్ప‌ష్టంగా చెప్పాడు. క‌థ‌ని మొద‌లుపెట్టిన విధానం, ముగింపు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • బ‌లాలు
  • + షారూఖ్ మాస్ అవ‌తార్
  • + క‌థ‌నం, సినిమాటోగ్రఫీ, నేప‌థ్య సంగీతం
  • + మాస్ అంశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు
  • చివ‌రిగా.. :జ‌వాన్... పైసా వ‌సూల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Last Updated : Sep 7, 2023, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details