Jawan Movie Interesting Facts : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయన్‌తార లీడ్ రోల్స్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. 'రాజారాణి' ఫేమ్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ప్రియమణి లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన హిందీ ప్రివ్యూ కూడా మంచి క్రేజ్ సంపాదించుకోగా..ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా.. 'జవాన్' గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..
- 1992లో కెరీర్‌ని ప్రారంభించిన కింగ్ ఖాన్.. సౌత్ ఇండస్ట్రీకి చెందిన వారితో కలిసి పనిచేయడం చాలా తక్కువ. ఈ క్రమంలో ఆయన అట్లీకి ఛాన్స్ ఇవ్వడం వల్ల ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. ఇక సౌత్ ఇండస్ట్రీ నుంచి షారుక్‌ని డైరెక్ట్ చేసిన రెండో వ్యక్తిగా అట్లీ నిలిచారు. అంతకుమందు లోకనాయకుడు కమల్ హాసన్ దర్శకత్వంలో షారుక్ 'హే రామ్'లో నటించారు.
- సుమారు 13 ఏళ్ల క్రితం షారుక్‌ను చూసేందుకు ముంబయి వెళ్లానని, ఆయన్ను చూడలేకపోవడం వల్ల ఇంటి ముందు ఫొటో దిగి వచ్చానని, అలాంటి తాను ఈ సినిమా కథ వినిపించేందుకు కారులో షారుక్ ఇంటికి వెళ్లడం మరిచిపోలేని జ్ఞాపకమంటూ దర్శకుడు అట్లీ ఒకానొక సందర్భంలో గుర్తుచేసుకున్నారు.
- ఈ సినిమాలో డ్యూయెల్ రోల్లో చేసిన షారుక్.. విభిన్న లుక్స్‌లో కనిపిస్తారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ద్వారా ఆ లుక్స్ అన్నింటినీ ప్రేక్షకులకు చూపించారు మేకర్స్.
- కోలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన తొలి హిందీ సినిమా 'జవాన్'. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె, సంజయ్ దత్ గెస్ట్ రోల్స్‌లో కనిపించారు. ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు.
- ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ రోల్లో నటించారు. హిందీలో ఆయన నటించిన రెండో సినిమా ఇది. అయితే, తొలి సినిమా 'ముంబైకర్' ఓటీటీలో విడుదల కావడం వల్ల 'జవాన్'పై ఎన్నో ఆశలతో ఉన్నారు సేతుపతి అభిమానులు. "నేను స్కూల్‌లో చదువుతున్న సమయంలో ఓ అమ్మాయిని లవ్ చేశాను. కానీ, ఆమెకు షారుక్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను షారుక్ సినిమాలో నటించి ఇన్నేళ్ల తర్వాత ఆమెపై రివెంజ్ తీర్చుకున్నాను" అంటూ విజయ్ ఓ ఈవెంట్‌లో సరదాగా చెప్పారు.
- షారుక్- అనిరుధ్ అట్లీ- అనిరుధ్ కలిసి పనిచేసిన తొలి సినిమా ఇదే. ఇక టెక్నీషియన్‌గానే కాదు వ్యక్తిగతంగా అనిరుధ్ అంటే తనకెంతో ఇష్టమంటూ 'జవాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో షారుక్ అన్నారు. అనిరుధ్ తన కొడుకులాంటివాడని పేర్కొన్నారు.
- ఈ సినిమాలో మల్లయుద్ధం సన్నివేశాలు, ఊపిరి బిగపట్టించే కారు ఛేజ్‌లు, గగుర్పొడిచే బైక్ స్టంట్‌లు ఎక్కువగా ఉంటాయట. అంతర్జాతీయంగా పేరున్న స్పిరో రజాటోస్, క్రెయిగ్ మాక్రే, యానిక్ బెన్, కిచా కఫడ్గీ, సునీల్ రోడ్రిగ్స్, అనల్ అరసు.. అనే ఆరుగురు స్టంట్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఆయా సీన్లను షూట్ చేశారట
- ఈ సినిమా షూటింగ్ పుణె, ముంబయి, చెన్నై, రాజస్థాన్, ఔరంగాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జరిగింది. దీని బడ్జెట్ సుమారు రూ. 300 కోట్లు. ఇక 'జవాన్'కు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దీని రన్‌టైమ్ 2: 49 గంటలు.
- ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో అంగరంగ వైభవంగా జరగ్గా.. ముంబయిలోని షారుక్ నివాసం 'మన్నత్' వద్ద 'జవాన్' స్టార్స్ లుక్స్‌తో క్రియేట్ చేసిన వాల్ ఆర్ట్ నెట్టింట వైరల్ అయింది.
- ఇప్పటి వరకు చాలా సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబరు 7న తెలుగు, తమిళం, హిందీలో రిలీజవ్వనుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని గంటల్లోనే సుమారు 8 లక్షల టికెట్లు (తొలిరోజుకు సంబంధించి) అమ్ముడైపోయాయట.