తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జాతిరత్నాలు డైరెక్టర్‌ భారీ స్కెచ్‌, ఆ బడా హీరో కోసం స్టోరీ రెడీ - డైరెక్టర్​ అనుదీప్​

జాతిరత్నాలు సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కేవీ అనుదీప్​. ఆ సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త రకమైన వినోదాన్ని పరిచయం చేశారు. ప్రస్తుతం ఆయన హీరో శివ కార్తికేయన్‌తో ప్రిన్స్‌ సినిమా తీస్తూనే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోకు కథను అందించారు. ఈ నేపథ్యంలో అనుదీప్​ సరికొత్త విషయాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే.

jathiratnalu director anudeep
Etv jathiratnalu director anudeep

By

Published : Aug 28, 2022, 8:52 AM IST

Jathiratnalu Director Anudeep Interview : "మంచి డ్రామాతో కూడిన కథలు రాయడమంటే ఇష్టం. భయపెట్టడం, హింసని చూపించే సినిమాలు తప్ప అన్ని రకాల చిత్రాలు చేయాలని ఉంది" అన్నారు దర్శకుడు అనుదీప్‌.కె.వి. 'జాతిరత్నాలు'తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడాయన. ఆ సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త రకమైన కథని, వినోదాన్ని పరిచయం చేశారు. ప్రస్తుతం శివ కార్తికేయన్‌తో 'ప్రిన్స్‌' సినిమా తీస్తూనే.. 'ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో'కి కథని అందించారు. శ్రీకాంత్‌, సంచిత బసు జంటగా.. వంశీధర్‌ గౌడ్‌, లక్ష్మీనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అనుదీప్‌ శనివారం ముచ్చటించారు. ఆ విషయాలివీ..

"చిన్న పట్టణాల్లో సినిమా థియేటర్లు.. అక్కడ టికెట్ల కోసం ప్రేక్షకులు చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉంటాయి. స్వతహాగా నాకు తొలి రోజు తొలి ఆట చూడటమంటే ఇష్టం. అలా చూడకపోతే సినిమా చూసినట్టే ఉండేది కాదు. ఆ నేపథ్యంలో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఉండేది. ప్రేక్షకులకు కూడా ఓ కొత్త జోనర్‌ని చూపించినట్టు ఉంటుందని ఈ కథ రాశా. మొదట నేనే దర్శకత్వం చేయాలనుకున్నా. నేను చేయాల్సినవి ఉండటం, నా సహాయ దర్శకులకి ఈ కథ బాగా నచ్చడంతో వాళ్లకి ఇచ్చా. వంశీధర్‌గౌడ్‌ ఈ సినిమాకి దర్శకుడే కాదు, అందులో నటుడు కూడా. అన్ని పనులు చేయడం కష్టం కావడంతో తోడుగా మరో దర్శకుడూ ఉంటే బాగుంటుందన్నాడు. అలా లక్ష్మినారాయణ ఇందులోకి వచ్చాడు. హాస్యం విషయంలో మా అందరి మధ్య సారూప్యతలు కనిపిస్తాయి. దీని చిత్రీకరణ సమయంలో నేను లేకపోయినా స్క్రిప్ట్‌, ఎడిటింగ్‌ ఇతరత్రా విషయాల్లో నా ప్రమేయం ఉంది." అని అనుదీప్​ చెప్పారు.

"పవన్‌కల్యాణ్‌ అంటే అభిమానం. వెంకటేష్‌ అన్నా ఇష్టం. 'పోకిరి' తొలి రోజు తొలి ఆట చూడటం కోసం చాలా కష్టపడ్డా. ఈ కథ రాసుకున్నాక అప్పట్లో క్రేజ్‌ ఉన్న పలు సినిమాల్ని పరిశీలించి 'ఖుషి' నేపథ్యాన్ని తీసుకున్నాం. రెండు రోజుల్లో జరిగిపోయే కథ ఇది. చిన్న అంశమే. దాన్ని రెండు గంటల కథగా మలచడం సవాల్‌గా అనిపించింది. ఈ కథ ఎప్పట్నుంచో ఉన్నా, 'జాతిరత్నాలు' తర్వాతే నేను, వంశీ కూర్చుని సంభాషణలు రాశాం. నాయకానాయికలుగా పేరున్న నటుల్ని ఎంచుకుంటే.. వీళ్లకి తొలి రోజు తొలి ఆట టికెట్‌ దొరకలేదని చూపించడం అంత సహజంగా అనిపించదు. అందుకే కొత్తవాళ్లైన శ్రీకాంత్‌, సంచితని ఎంపిక చేశాం. శ్రీకాంత్‌ నాకు స్నేహితుడే అయినా ఆడిషన్స్‌ చేశాకే ఎంపిక చేశాం. చేస్తున్నప్పుడు మజా రావాలి కానీ, చిన్న నటులా పెద్ద నటులా అనే లెక్కలు వేసుకోను. ఈ సినిమాని నాగ్‌అశ్విన్‌కి చూపించాం. ఆయనకి బాగా నచ్చింది. పవన్‌ కల్యాణ్‌కీ చూపించాలనే ఆలోచన ఉంది."

-- దర్శకుడు అనుదీప్

"అమాయకత్వం నుంచి పుట్టే కామెడీ అంటే ఇష్టం. అమాయకత్వం అనేది అందరికీ సులభంగా కనెక్ట్‌ అవుతుంది. ఈ విషయంలో నాపైన ఛార్లీచాప్లిన్‌, రాజ్‌కపూర్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నా 'ప్రిన్స్‌'ను పాండిచ్చేరి నేపథ్యంలో సాగే ప్రేమకథతో తెరకెక్కిస్తున్నా. అందరూ చూడదగ్గ కథ అది. నా శైలి వినోదం ఉంటుంది. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. వెంకటేష్‌కి కథ వినిపించాల్సి ఉంది. 'జాతిరత్నాలు' సీక్వెన్స్‌పై కొన్ని ఆలోచనలు ఉన్నాయి. రెండు మూడేళ్ల తర్వాత ఆ సినిమా చేయాలి." అంటూ చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి:కథలు సిద్ధం, సినిమాలు పట్టాలెక్కేది ఎప్పుడో

అంత ఖర్చు పెట్టి సినిమాలకు ఎవరు వస్తారన్న నరేశ్

ABOUT THE AUTHOR

...view details