Japan Movie Pre Release Event : హీరో కార్తీ గురించి సినీ లవర్స్‌కు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ స్టార్ హీరో.. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు సుపరిచితుడే. 'పొన్నియిన్ సెల్వన్ 2' తో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు 'జపాన్' అనే సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. తన మాస్ డైలాగ్‌లతో అందరినీ అలరించారు. ఆయన చెప్పిన యుగానికి ఒక్కడు సినిమాలోని.. 'ఎవర్రా మీరంతా' అనే డైలగ్కు హాల్ అంతా చప్పట్ల సౌండ్‌తో మారుమోగిపోయింది. దీంతో పాటు సినిమా గురించి చాలా విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. రాజు మురుగన్ తనకు 'జపాన్' సినిమా కథ వినిపించినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని బలంగా కోరుకున్నట్ల చెప్పారు. తన మనసుకు ఈ జపాన్ సినిమా దగ్గరగా ఉంటుందని తెలిపారు.
తను నటించిన 'జపాన్' సినిమా గురించి కార్తి చేసిన వ్యాఖ్యలు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కే ప్రత్యేకంగా నిలిచాయి." నవంబర్ 10 వ తేదీన ఈ సినిమా వస్తుంది. మీరంతా థియేటర్లకు వచ్చి సినిమా చూడకపోతే మీ సీట్ల కింద బాంబులు పెడతాను" అంటూ డైలాగ్ చెప్పారు. ఈ ఒక్క మాటతో అక్కడున్నా ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. కార్తీ చెప్పిన ఈ డైలాగ్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.