Japan Movie Review :రివ్యూ: జపాన్; నటీనటులు: కార్తి, అను ఇమ్మానుయేల్, సునీల్, విజయ్ మిల్టన్, జితన్ రమేశ్ తదితరులు; సినిమాటోగ్రఫీ: ఎస్.రవి వర్మన్; సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్; ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్; పాటలు: భాస్కరభట్ల రవికుమార్, రాకేందు మౌళి వెన్నెలకంటి; పోరాటాలు: అనల్ అరసు; ప్రొడక్షన్ డిజైన్: వినేష్ బంగ్లాన్; నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు, దర్శకత్వం: రాజు మురుగన్; సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్; విడుదల: 10-11-2023; విడుదల సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్.
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి తాజా చిత్రం 'జపాన్'. దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 10 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరో కార్తి. మరి డబ్బు దోపిడీ నేపథ్యం.. తమిళనాడులోని ఓ నిజమైన దొంగ కథగా ప్రచారమైన ఈ సినిమా ఎలా ఉందంటే?
కథేంటంటే :జపాన్ ముని (కార్తి).. ఓ పేరు మోసిన దొంగ. దొంగతనానికి ప్లాన్ చేశాడంటే.. గురి తప్పదంతే. పోలీసుల్ని కూడా లెక్కజేయకుండా.. తాను అనుకున్నది కాజేస్తాడు. అయితే ఒక రోజు దొంగతనం చేస్తుండంగా.. పోలీసులకు చెందిన కొన్ని సీక్రెట్ వీడియోలు తన చేతికి దొరుకుతాయి. వాటిని తన దగ్గరే ఉంచుకున్న జపాన్.. పోలీసులకి టార్గెట్‌గా మారతాడు. ఎలాగైనా ఆ వీడియోల్ని సొంతం చేసుకుని జపాన్, సంగతి తేల్చాలని పోలీస్ అధికారులు శ్రీధర్ (సునీల్), భవాని (విజయ్ మిల్టన్) రంగంలోకి దిగుతారు.
మరోవైపు కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ని వెంబడిస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ జ్యువెలరీ షాపులోంచి రూ.200 కోట్లు విలువైన నగలు దోపిడీకి గురవుతాయి. ఆ దొంగతనం జపాన్ చేశాడని పోలీసులకి ఆధారాలు దొరుకుతాయి. అయినప్పటికీ.. ఓ అమాయకుడు ఆ కేసులో ఇరుక్కుంటాడు. ఇంతకీ ఆ దొంగతనం ఎవరు చేశారు? జపాన్ దొరికాడా? ఆ అమాయకుడు ఈ కేసు నుంచి బయటపడ్డాడా? అసలు జపాన్ దొంగలా ఎలా మారాడు? సినీ నటి సంజు (అను ఇమ్మానుయేల్)తో జపాన్‌కి ఏం సంబంధం? వీటి గురించి క్లారిటీ రావాలంటే.. సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే :మనీ హెయిస్ట్ (దోపిడీ) నేపథ్యంలో సాగే సినిమాలకి ఉండే క్రేజ్ వేరు. వీటికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఇంట్రెస్టింగ్గా ఉండే కథలు ప్రేక్షకులని థ్రిల్ చేస్తుంటాయి. అలా కార్తి చేసిన మనీ హెయిస్ట్ లాంటి ప్రయత్నమే ..'జపాన్'. ఈ సినిమాలో హీరో కార్తి మార్క్ కామెడీ, విభిన్నమైన నేపథ్యంతో కూడిన విధంగా తన పాత్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు. తల్లి సెంటిమెంట్ ఎలిమెంట్స్ జోడించారు. మేళవింపు వరకూ బాగానే ఉంది కానీ.. కథని నడిపిన విధానంలోనే సమస్యలున్నాయి. సీరియల్ సెంటిమెంట్, క్రింజ్ అంటూ ఇందులో చాలా చోట్ల హీరో వ్యంగ్యంగా డైలాగులు చెబుతాడు. ఆ మాటలకి తగ్గట్టే ఇందులో కొన్ని సీన్స్ మరీ బలవంతపు డ్రామాతోనూ, కొన్ని స్పష్టత లేనట్టుగా సాగుతాయి. ఇక నగల దుకాణంలో దొంగతనం నుంచే.. అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. దోపిడీ జరిగిన చోట ఆధారాలు సేకరించడం, ఆ క్రమంలో నగలు తయారు చేసే దుకాణాల దగ్గర డ్రైనేజీలో కలిసే వ్యర్థాల నుంచి బంగారం సేకరించి పొట్ట పోసుకునే జీవితాల్ని చూపించడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
జపాన్ పాత్ర రాకతో కథలో జోష్ వస్తుంది. గోల్డెన్ స్టార్‌గా జపాన్ సినిమాతో చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. జపాన్ జల్సా జీవితం, హీరోయిన్‌తో ప్రేమ వ్యవహారం నేపథ్యంతో సన్నివేశాలు సాగుతాయి. మరోవైపు ఈ కేసులో అడ్డంగా ఇరుక్కుపోయిన ఓ అమాయకుడి జీవితాన్ని చూపిస్తూ స్టోరీ ముందుకు తీసుకెళ్లారు. ఇంటర్వెల్ సీన్స్ ఆసక్తిని రేకెత్తిస్తాయి. సింహం ముసుగులో నక్క ఉందన్న అంశమే ప్రధానంగా సెకండ్ హాఫ్ మొదలవుతుంది. అయితే ఆ నక్క ఎవరనే విషయం బయటపడే తీరు పేలవంగా ఉంటుంది. పతాక సన్నివేశాలు సినిమాకి ప్రధానబలం. ఈ కథలో హెచ్.ఐ.వి ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు అది ఎందుకో అర్థం కాదు. ఆ నేపథ్యం కథపైనా, డ్రామాపైన పెద్దగా ప్రభావం చూపించదు. హెచ్.ఐ.వి ప్రస్తావన లేకపోయుంటే పతాక సన్నివేశాల్లో హీరో పాత్ర మరింత ప్రభావం చూపించేదేమో. మొత్తానికి అక్కడక్కడా ఆకట్టుకునే సీన్స్, హీరో పాత్ర చేసే హంగామా మినహాయిస్తే.. సినిమా అంతగా మెప్పించదు.