Janhvi Kapoor NTR: టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్‌పై ఉన్న ఇష్టాన్ని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మరోసారి వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి నటించాలనేది తన కల అని చెప్పారు. 'మిలీ' సినిమా ప్రచారంలో భాగంగా నగరానికి విచ్చేసిన జాన్వీ.. మీడియాతో ముచ్చటించారు. ఆ క్రమంలో ఎన్టీఆర్ గురించి చెప్పమని ఓ విలేకరి అడగ్గా.. "ఇప్పటికే చాలా సార్లు చెప్పా. ఆయన్ను ఇష్టపడని వారెవరుంటారు. ఎన్టీఆర్ ఓ లెజెండ్. ఆయనతో కలిసి నటించాలనుంది" అని జాన్వీ వివరించారు. అనంతరం, దక్షిణాది చిత్రాలంటే తనకెంతో ఇష్టమని, ఆ ఇండస్ట్రీలో నటించే అవకాశం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నానని జాన్వీ అన్నారు.
'మీ దగ్గరకు వచ్చిన కొన్ని కథలను రిజెక్ట్ చేశారట. ఏదైనా పెద్ద ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నారా?' అని మరో విలేకరి జాన్వీని ప్రశ్నించగా బోనీ కపూర్ స్పందించారు. ఆ విషయాలు చర్చించేందుకు అది సరైన వేదిక కాదని సమాధానాన్ని ఆయన దాటవేశారు. జాన్వీ ప్రధాన పాత్రలో దర్శకుడు మత్తుకుట్టి జేవియర్ తెరకెక్కించిన చిత్రమే 'మిలీ'. మలయాళ చిత్రం 'హెలెన్'కు రీమేక్‌గా రూపొందింది. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకురానుంది.
అలా నటించటం మామూలు విషయం కాదు
ఈ సినిమా గురించి జాన్వీ కపూర్ మాట్లాడారు. "దర్శకుడు స్క్రిప్టు వినిపించినప్పుడే.. ఈ సినిమాలో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఉంటుందనిపించింది. మిలీ పాత్ర సవాలు విసిరింది. మా నాన్నతో నేను చేసిన తొలి సినిమా ఇది. మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రతలో 22 రోజుల పాటు ఈ సినిమాని చిత్రీకరించారు. ఓ నటిగా సుమారు 16 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఆయా సన్నివేశాల్లో నటించేందుకు చాలా ఇబ్బంది పడ్డా" అని తెలిపారు.