దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రభంజనం ఇంకా ఆగలేదు! ఎన్నో బాక్సాఫీస్ రికార్డులకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ చిత్రం.. ఓటీటీలో విడుదలైన తర్వాత అంతకు మించి ప్రభంజనం సృష్టించింది. ఇటీవల ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌ను ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వరించింది. దాంతో పాటు 2023 ఆస్కార్ అవార్డులకు నామినేషన్ కూడా దక్కించుకుంది.
రామ్‌చరణ్‌ను ఆకాశానికెత్తేసిన జేమ్స్ కామెరూన్.. రాజమౌళితో మళ్లీ మాట్లాడాలని ఉందట! - జేమ్స్ కామెరూన్ స్పెషల్ ఇంటర్వ్యూ
దిగ్గజ దర్శకుడు జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. 2022లో రిలీజైన ఈ సిినిమా.. ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. అలా గోల్డెన్ గ్లోబ్‌ను ముద్దాడిన ఈ సినిమాను చూసిన 'అవతార్' డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అందులోని నటీనటులను పొగడ్తలతో ముంచెత్తారు. ఇక హీరో రామ్‌చరణ్‌ను ఆయన ఆకాశానికి ఎత్తేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
ఇకపోతే, అవతార్, టైటానిక్ వంటి అద్భుతమైన దృశ్యకావ్యాలను తెరకెక్కించిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. లాస్ ఏంజెలిస్‌లో ఓ అవార్డ్ షోలో రాజమౌళిని కలిసి కాసేపు మాట్లాడారు కూడా. అప్పుడే ఆర్ఆర్ఆర్ సినిమాను మెచ్చుకున్న కామెరూన్.. ఇప్పుడు 'టైటానిక్' చిత్రం రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పలు మీడియా ఛానెల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్లో హీరో రామ్‌చరణ్ పాత్ర గురించి మాట్లాడారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
"ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర నాకు ఎంతగానో నచ్చింది. ఆ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వాస్తవానికి అలాంటి పాత్రలు పోషించడం చాలా కష్టం. రాజమౌళి ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు అద్భుతం. సినిమాలో కథ చెప్పిన విధానం షేక్స్పియర్ను గుర్తుచేసింది. ఇటీవలే రాజమౌళిని కలిసినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. కానీ ఎక్కువసేపు మాట్లాడుకోలేకపోయాం. ఆయనతో మళ్లీ మాట్లాడాలని అనుకుంటున్నా" అంటూ జేమ్స్ కామెరూన్ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ వీడియోను రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. తమ హీరోకి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా గర్వంగా ఉందంటూ మురిసిపోతున్నారు. తండ్రిని మించిన తనయుడంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ఫ్యాన్స్.