Jailer Movie Chiranjeevi : సాధారణంగా లవ్‌స్టోరీ, నాలుగు పాటలు, ఫైట్.. చాలా సినిమాల్లో ఇదే రిపీట్ అవుతోంది. కానీ కొన్ని చిత్రాలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. అందులో ఒకటి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జైలర్'. సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్ లేదు. రొమాంటిక్ పాటలు లేవు. రౌడీలను హీరో చితక్కొట్టే సన్నివేశాలు కూడా పెద్దగా లేవు. అయినా చిత్రం బ్లాక్‌బస్టర్. కొంత కాలంగా వరుస పరాజయాలతో ఉన్న రజనీ.. జైలర్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.650 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమాను ఓ హీరో చేతులారా వదిలేసుకున్నారంటూ కోలీవుడ్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవే నంట! డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ మొదట జైలర్ కథను చిరుకు వినిపించారట. అయితే పెద్దగా పాటలు లేకపోవడం వల్ల చిరు అంతగా ఆసక్తి చూపించలేదట. దీంతో నెల్సన్.. రజనీకాంత్‌ను కలవగా ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
ఇకపోతే రజనీ జైలర్(ఆగస్టు 9న), చిరంజీవి భోళా శంకర్ (ఆగస్టు 11న) కేవలం రెండు రోజుల వ్యవధిలోనే థియేటర్లలో విడుదలయ్యాయి. భోళా శంకర్ ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని అపజయాన్ని మూటగట్టుకోగా జైలర్ హిట్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్.. బాస్ అయ్యో మంచి హిట్ మిస్ అయ్యారంటూ కామెంట్లు పెడుతున్నారు.
చిరంజీవి@ 45 ఏళ్లు..
మరోవైపు, చిత్రసీమలోకి అడుగుపెట్టి మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు రామ్‌చరణ్.. సోషల్‌మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. తండ్రికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. "చిత్రసీమలో 45 ఏళ్ల పూర్తి చేసుకున్న మన ప్రియతమ మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. ఎంత అద్భుతమైన ప్రయాణం! ప్రాణంఖరీదుతో ప్రారంభమైన మీ కెరీర్.. ఇప్పటికీ మీ అబ్బురపరిచే ప్రదర్శనలతో కొనసాగుతోంది. మీ ఆన్ స్క్రీన్ ప్రదర్శనలతో పాటు ఆఫ్ స్క్రీన్ మానవతా కార్యకలాపాలతో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కృషి, అంకితభావం అన్నింటికంటే ముఖ్యంగా కరుణ వంటి విలువలను పెంపొందించినందుకు నాన్నగారికి ధన్యవాదాలు" అంటూ చెర్రీ రాసుకొచ్చారు.