జబర్దస్త్‌లో కన్ఫ్యూజన్ స్కిట్లతో కడుపుబ్బా నవ్విస్తుంటాడు వెంకీ మంకీ. తనపై తానే వేసుకొనే జోక్‌లు ఎన్నోసార్లు పేలాయి. అలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అతడు.. దానికోసమే ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలేసుకున్నట్లు తెలిపాడు. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా ముచ్చటించిన వెంకీ.. జబర్దస్త్‌లో తన ప్రయాణం, లేడీ గెటప్ కష్టాలు సహా పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు.
"జబర్దస్త్ మొదలైన 14వ ఎపిసోడ్ తర్వాత నా మిమిక్రీ షో చూసి చంద్ర అన్నా నన్ను పిలిచాడు. అతనే నాకు ఈ రోజు ఈ జీవితాన్ని ఇచ్చాడు. చంద్ర టీమ్‌లో ఓ 30 ఎపిసోడ్లు చేశాను. ఆ తర్వాత రాఘవ టీమ్‌లో 50 స్కిట్లు చేస్తే.. అందులో 45కి పైగా లేడీ గెటప్‌లే. వినోదిని రాకముందు లేడీ గెటప్‌ల క్రెడిట్ నాకే ఉండేది. ఆ తర్వాత నా అదృష్టం కొద్దీ వేణు అన్నా టీమ్‌లోకి వెళ్లాను. అక్కడ స్కిట్ రాయడం, టైమింగ్ లాంటివి నేర్చుకున్నా. ఆ తర్వాత టీమ్‌లీడర్‌గా అవకాశం వచ్చింది. ఇప్పటికీ ఐదేళ్లు అవుతుంది. నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఆలోచనతో కన్ఫ్యూజన్ థీమ్‌తో స్కిట్లు చేస్తున్నాను. వాటివల్లే నాకు మంచి పేరు, గుర్తింపు వచ్చాయి." అని వెంకీ తెలిపాడు.
"లేడీ గెటప్‌లు వేయడం అంత ఈజీ కాదు. మేకప్ చాలా హెవీ ఉంటుంది. విగ్, చీరలో ఉండటం కష్టం. ఆడవారు ఎదుర్కొనే ఇబ్బందులు అప్పుడే మనకు అర్థమవుతాయి. జబర్దస్త్‌లో లేడీ గెటప్‌లు వేసే వారికి నిజంగా దండం పెట్టాలి. ఎందుకంటే చీరకట్టుకొని నడవడమే కష్టం. అలాంటిది జంప్‌లు, ఫైటింగ్, డాన్సులు వేయడం కత్తిమీదసామే."