కెవ్వు కార్తీక్.. ఒక సాధారణ కంటెస్టెంట్‌గా జబర్దస్త్‌లో తన ప్రయాణం మొదలు పెట్టి టీమ్ లీడర్‌గా ఎదిగాడు. కంటెస్టెంట్‌గా, టీమ్ లీడర్‌గా తనదైన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ కెరీర్లో ముందుకెళ్తున్నాడు. తాజాగా ఈటీవీ భారత్‌తో ముచ్చటించిన అతడు.. జబర్దస్త్ వల్లే తన తల్లిని కాపాడుకోగలిగినట్లు చెప్పాడు. ఇంకా తన లైఫ్, కెరీర్ గురించి ఇంకా ఏమన్నాడంటే..
2013లో జబర్దస్త్ ప్రారంభమైన తర్వాత.. తాను 2015 మొదట్లో ఒక సాధారణ కంటెస్ట్‌గా అడుగుపెట్టానని, మొదట ధన్‌రాజ్ టీమ్‌లో చేసినట్లు చెప్పాడు కార్తీక్. ఆ తర్వాత తిరుపతి ప్రకాశ్ టీమ్‌లో ఆరో కంటెస్ట్‌గా చేసినట్లు తెలిపాడు. 2016లో ముక్కు అవినాశ్‌తో టీమ్ లీడర్‌గా అవకాశం వచ్చిన తర్వాతే.. తన కేరీర్లో చాలా మార్పులు వచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్ లీడర్‌గా కొనసాగుతున్నానని, అందుకు జబర్దస్త్‌కు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నాడు.
"మాది వరంగల్. అక్కడే ఇంజినీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చాను. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా చాలా తక్కువ పేమెంట్స్‌కు షోలు చేస్తూ ఉన్నాను. జబర్దస్త్ ద్వారా అందరు గుర్తుపట్టడం ప్రారంభించారు. నేను 2016లో అమెరికా వెళ్లాను. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేసియా వంటి చాలా దేశాలు తిరిగాను. మారుమూల గ్రామంలో పుట్టిన మనం ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగువారికి తెలుసు అనేదే పెద్ద విజయం. 2016లో దోహా విమానాశ్రయంలో కనెక్టింగ్ విమానం కోసం చూస్తుండగా ఒక పెద్దావిడ బుర్కా వేసుకుని వచ్చి ఆటోగ్రాఫ్ అడిగింది. చాలా ఆనందంగా అనిపించింది. అప్పుడు నేను ఒక సాధారణ కంటెస్టునే. ఆ స్థాయిలో ఫేమ్ తీసుకొచ్చిన షో ఇది. చిరంజీవి, వెంకటేశ్ వంటి పెద్ద పెద్ద హీరోలు గుర్తుపడుతూ.. చాలా బాగా చేస్తున్నారంటూ ప్రోత్సహించటం చాలా గొప్ప విషయం. "
- కెవ్వు కార్తీక్.
జబర్దస్త్ వల్లే: "మా అమ్మ అనారోగ్యానికి గురైనప్పుడు జబర్దస్త్ నా జీవితంలో కీలక పాత్ర పోషించింది. జబర్దస్త్‌లో కాకుండా వేరే వృత్తిలో ఉండుంటే నా తల్లి కోసం అంత చేసుండేవాడిని కాదేమో. డబ్బులు మాత్రమే కాదు, ఏ ఆస్పత్రికి వెళ్లినా నాకు సాయం అందేది. ఈ షో చేయటం వల్ల... అందరు గుర్తుపట్టటంతో ఆమెకు మంచి వైద్యం అందిందని భావిస్తున్నా" అని కార్తిక్ చెప్పాడు.
మంచి స్నేహితులం: "జబర్దస్త్‌కు ముందే నేనుముక్కు అవినాశ్ మంచి స్నేహితులం. ఆ తర్వాత కలిసి చేయటం ద్వారా మా బంధం మరింత బలపడింది. వర్క్ పరంగా ఎలా ఉన్నా.. అవినాశ్ వేరేదాంట్లో చేస్తున్నా ఇప్పటికీ మేంమంచి స్నేహితులమే" అని కార్తీక్ అన్నాడు.
అదే జబర్దస్త్ మాకు ఇచ్చింది:జబర్దస్త్‌కు వచ్చిన ప్రతి ఆర్టిస్ట్‌కు వారి డ్రీమ్స్.. ఒక విధంగా కాకపోయినా మరో విధంగానైనా నెరవేరుతున్నాయన్నాడు కార్తీక్. ఇండస్ట్రీలో నిలబడాలంటే ఆర్థికంగా ఉండాలని, నెలకు కొంత ఆదాయం వచ్చేలా ఉంటే ఇంట్లో పనులకు గానీ, ఇతర వాటికి గానీ ఉపయోగపడుతుందని తెలిపాడు. కారు, ఇల్లు కొనుక్కోవటం, ఇంట్లో వాళ్లను బాగా చూసుకోవటం ద్వారా మన అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పాడు. సాధారణంగా కొన్నింటిని డబ్బులు పెట్టి కొనలేమని, అలా డబ్బులు పెట్టి కొనలేని వాటినే తమకు జబర్దస్త్ ఇచ్చిందన్నాడు. బయటకెళ్తే చాలా మంది గుర్తు పడుతున్నారని, అంతకంటే ఆనందం ఇంకేకావాలని పేర్కొన్నాడు.