'జబర్దస్త్'లో 'రెచ్చగోక్కు' అనే స్కిట్‌తో ఒక్కసారిగా పాపులర్ అయిన కమెడియన్ బాబీ. స్వచ్ఛమైన యాసతో డైలాగులు చెప్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించేస్తుంటాడు. కెమెరా అసిస్టెంట్‌గా ప్రయాణం మొదలుపెట్టి.. ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. సినిమాల్లోనూ ఫుల్ బిజీ అయ్యాడు. అయితే ఈ వరుస అవకాశాలు అంత సులభంగా రాలేదని చెప్తున్నాడు బాబీ. అందుకోసం ఎంతో శ్రమించినట్లు ఈటీవీ భారత్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపాడు.
"2012 నుంచి నా సినీ ప్రయాణం కొనసాగుతోంది. మొదట 'జబర్దస్త్', 'ఢీ', 'క్యాష్' వంటి ఈటీవీ ప్రోగ్రామ్స్‌కు కెమెరా అసిస్టెంట్‌గా పనిచేశాను. అప్పటి నుంచి టీమ్లీడర్లను పరిచయం చేసుకొని, ఉద్యోగం మానేశాక వారి సహకారంతో ఇక్కడ చేస్తున్నాను. చిరంజీవి వంటి నటుల స్ఫూర్తితో ఆర్టిస్ట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని. అందుకే హైదరాబాద్ వచ్చేశాను. కానీ వెంటనే అవకాశాలు రాలేదు. మనం ఏంటో ముందుగా తెలుసుకోవాలని కళామతల్లి పరీక్ష పెట్టినట్లు ఉంది. మన కష్టం చూశాక.. బాగా కష్టపడుతున్నాడు అని అవకాశాలు ఇప్పించింది"అని బాబీ తెలిపాడు.
అదే నా ప్రత్యేకత: "మొదట అదిరే అభి అవకాశం ఇచ్చారు. ఆ తర్వత కిర్రాక్ ఆర్పీ టీమ్‌లో చేసినప్పటి నుంచి మంచి పేరు వస్తోంది. స్టేజి మీద ఎలాంటి ప్రదర్శన చేసినా.. మా ఊరి యాసలో చెప్తాను. అందుకు మా ఊరి వాళ్లు నన్ను మెచ్చుకుంటూ ఉంటారు. నేను చేసిన రెచ్చగొట్టకు (రెచ్చగోక్కు) సహా పలు స్కిట్లు నాకు బాగా పేరు తీసుకొచ్చాయి."