Jabardast Dorababu: నటుడు అవ్వాలనే కోరికతో హైదరాబాద్ వచ్చిన అతడు.. 'జబర్దస్త్' దొరబాబుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు సినిమాల్లో నటించినా రాని ఫేమ్‌ను ఈ ఒక్క షోతో సంపాదించుకున్నాడు. ఆది టీమ్‌లో కంటెస్టెంట్‌గా ఉండే ఇతడు.. తనపై పంచ్‌లు వేయించుకుంటూ.. ఇతరులపై వేస్తూ.. ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. తాజాగా ఈటీవీ భారత్ అతడిని పలకరించింది. అతడి కెరీర్ ఎలా మొదలైంది? ప్రస్తుతం ఎలా సాగుతుంది? వంటి విషయాలను అడిగి తెలుసుకుంది. అవన్నీ అతడి మాటల్లోనే..
వారిద్దరి వల్లే ఈ స్థాయికి.. "2015 నుంటి ప్రయత్నిస్తే.. 2016లో ఆది టీమ్ లీడర్ అయ్యాక అవకాశం దొరికింది. అప్పటికే బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా నటిస్తుండేవాడిని. 'జబర్దస్త్'లోని ఒక్క ఎపిసోడ్లో కనిపిస్తే చాలు, ఒక్క డైలాగ్ చెప్తే చాలు అనుకున్నా. కానీ ఆ తర్వాత ఆది టీమ్‌లో చేయడం.. అలా నాగబాబుగారికి కనెక్ట్ అవ్వడం.. ఆయన ప్రోత్సహించడం ద్వారా చాలా స్కిట్లు, క్యారెక్టర్లు చేశా. మొత్తంగా నన్ను, మా టీమ్‌ను ఆదిరించినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఓ కామెడీ షో ఇన్ని సీజన్లు కొనసాగడం ప్రపంచంలో ఇదే తొలిసారి అనుకుంటున్నా. ఈ షో ఎంతో మంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చింది. సమాజంలో ఆర్టిస్టులుగా, గౌరవాన్ని ఇచ్చింది. గుర్తింపు తెచ్చి పెట్టింది. వారిని ఓ స్థాయికి తీసుకెళ్లింది. అందరూ బాగా సెటిల్ అయ్యారు. మొత్తానికి మొదటినుంచి ఆది బాగా ప్రోత్సహించారు. దానికి నాగబాబు బాగా సపోర్ట్ చేశారు. వారిద్దరి వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నా.