IT Raids Tamilnadu: ఇటీవలే తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లలో ఆదాయపు పన్నుశాఖ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున 'నల్లధనం' గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం వెల్లడించింది. ఈ సోదాల్లో రూ.200 కోట్లకు పైనే 'లెక్కల్లో వెల్లడించని' ఆదాయాన్ని గుర్తించినట్లు సీబీడీటీ తెలిపింది.
ప్రముఖ సినీ నిర్మాతలు కలైపులి ఎస్.థాను, అన్బుసెళియన్, ఎస్‌ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజా తదితరుల కార్యాలయాల్లో గత మంగళవారం (ఆగస్టు 2) నుంచి మూడు రోజుల పాటు ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. చెన్నై, మధురై, కొయంబత్తూర్‌లోని మొత్తం 40 చోట్ల ఈ తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని రూ.26కోట్ల నగదు రూ.3కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దీంతో పాటు రూ.200కోట్లకు పైగా అప్రకటిత ఆదాయాన్ని గుర్తించినట్లు సీబీడీటీ తెలిపింది. లెక్కల్లో వెల్లడించని ఈ ఆదాయానికి సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. నిర్మాతల ఇళ్లల్లో చేసిన తనిఖీల్లో సినిమాల విడుదల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తక్కువగా చూపించినట్లు అధికారులు గుర్తించారు. అంతేగాక, సినిమా డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి ఆ మొత్తాన్ని లెక్కల్లో చూపించలేదని వెల్లడించారు.