Is Salaar Remake Of Ugramm : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో నటించిన 'సలార్' ట్రైలర్ విడుదలైన తర్వాత కన్నడ సినిమా 'ఉగ్రం' పేరు తెరపైకి వచ్చింది. 'కేజీఎఫ్' రెండు భాగాల తర్వాత ప్రశాంత్ నీల్ కోసం అందరికీ తెలిసింది. అయితే ఆ రెండు సినిమాల కంటే ముందు కన్నడలో ఆయన చేసిన చిత్రమే 'ఉగ్రం'.
అయితే 'సలార్' కథ, 'ఉగ్రం' కథ ఒక్కటేనని, ప్రశాంత్ నీల్ గతంలో తీసిన సినిమాను తిప్పి తీస్తున్నారని, రీమేక్ చేస్తున్నారని కొన్నాళ్లుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. సంగీత దర్శకుడు రవి బస్రూర్ సైతం కన్నడ మీడియాతో ఓసారి 'ఉగ్రం సినిమాకు 'సలార్' రీమేక్ అని అందరికీ తెలిసిన విషయమే అని చెప్పారు. దీంతో ట్రైలర్ విడుదల తర్వాత రెండు కథల మధ్య కంపేరిజన్స్ మొదలయ్యాయి. తాజాగా హోంబలే ఫిల్మ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగందూర్ ఆ రూమర్స్‌పై స్పందించారు.
ప్రశాంత్ నీల్‌కు ఆ విషయం బాగా తెలుసు!
''ఉగ్రం, కేజీఎఫ్.. ఆ రెండు ప్రపంచాలను క్రియేట్ చేసింది ప్రశాంత్ నీల్. ప్రతి సారీ కొత్త సినిమా ఎలా అందివ్వాలో ఆయనకు తెలుసు. 'సలార్' మీద జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు'' అని హిందీలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత విజయ్ కిరగందూర్ తెలిపారు. ఆయన రీమేక్ కాదని స్పష్టంగా చెప్పినప్పటికీ 'సలార్' ట్రైలర్, 'ఉగ్రం' కథల మధ్య కంపేరిజన్స్ కొందరు చూపిస్తున్నారు.
'నీ కోసం ఎర అయినా అవుతా! సొర అయినా అవుతా' - ట్రైలర్ ప్రారంభంలో యంగ్ 'సలార్' (ప్రభాస్ చిన్ననాటి పాత్రధారి) చెప్పే డైలాగ్. స్నేహితుడి కోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉండే వ్యక్తిగా హీరోని చూపించారు. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ 'సలార్'లో వీళ్లిద్దరూ ప్రాణ స్నేహితులుగా కనిపిస్తారని ట్రైలర్ చూస్తే అర్థం అయ్యింది. కుర్చీ కోసం జరిగిన కుతంత్రాలు, యుద్ధంలో ప్రత్యర్థులు వేర్వేరు దేశాల నుంచి సైనాలను దింపితే వరద రాజ మన్నార్ మాత్రం తన స్నేహితుడు దేవా (ప్రభాస్)ను పిలుస్తాడు. ఆ ఒక్కడూ వందల మంది సైన్యంతో సమానమని చెప్పకనే చెప్పారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమ చూపించే వాళ్లిద్దరూ శత్రువులుగా మారితే? అదీ సినిమా కథ.