Samuthirakani new movie : "త్రివిక్రమ్, రాజమౌళి, గోపీచంద్ మలినేని, పరశురాం.. వంటి దర్శకులతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గొప్ప అవకాశం. మంచి చిత్రాలు చేసే అదృష్టం దొరికింది. గతేడాది దర్శకుడు రాజశేఖర్ రెడ్డి 'మాచర్ల నియోజకవర్గం' కథని వినిపించారు. చాలా నచ్చింది. తమిళనాడులోనూ ఓ చోట ఇరవయ్యేళ్లుగా ఎన్నికలు జరగలేదు. ఒక ఐఏఎస్ అధికారి వచ్చి పరిస్థితుల్ని చక్కదిద్దారు. ఈ కథ చెప్పినప్పుడు దర్శకుడికి ఇదే విషయాన్ని చెప్పా. నేను పోషించిన రాజప్ప తరహా పాత్రల్ని నా నిజ జీవితంలోనూ చూశా. ఆ పాత్రలో ఓ ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అదేమిటన్నది తెరపైనే చూడాలి. చాలా కష్టపడి చేసిన ఈ పాత్రని తెరపై చూసుకునేసరికి ఆ కష్టాన్నంతా మరిచిపోయా.
'నితిన్‌తో అదే ఇబ్బంది.. డైలాగ్ చెప్పడమూ కష్టమే!' - samuthirakani latest movie
"నటుడిగా వందశాతం తృప్తినిచ్చే పాత్రలు అరుదు. అలాంటి అరుదైన, నటనకు ప్రాధాన్యమున్న రాజప్ప పాత్రని పోషించడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అన్నారు ప్రముఖ నటుడు సముద్రఖని. దర్శకుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఆయన.. కొన్నేళ్లుగా ప్రతినాయక పాత్రలకు కేరాఫ్‌గా మారారు. ఇటీవల 'మాచర్ల నియోజకవర్గం'లో రాజప్ప పాత్ర పోషించారు. నితిన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు సముద్రఖని.
నితిన్ ఎంత ఉత్సాహంగా ఉంటారో, అంత పాజిటివ్‌గా ఉంటారు. ఆయన కళ్లల్లో చూసి కోపంగా డైలాగ్ చెప్పలేకపోయేవాణ్ని. ఆయనతో కలిసి ప్రయాణం చేయడం మంచి అనుభవం. వాణిజ్యాంశాలతోపాటు, ఒక మంచి కథ ఉన్న ఈ సినిమాలో ప్రేమకథ, కామెడీ, పోరాటాలు అన్నీ అలరిస్తాయి. నితిన్ హీరోగా, నేను దర్శకుడిగా త్వరలోనే ఓ సినిమా చేస్తాం. దాని గురించి మా ఇద్దరి మధ్య రెండేళ్ల కిందటే చర్చలు జరిగాయి. స్వతహాగా ఎడిటర్ అయిన దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ఎంతో స్పష్టతతో ఈ సినిమాని తీశాడు.
నాలోనూ దర్శకుడు ఉన్నా.. నటిస్తున్నప్పుడు తను బయటికి రాడు. రచన అంటే నాకు ప్రాణం. చిత్రీకరణ విరామంలోనూ ఏదైనా ఆలోచన వస్తే దాన్ని పేపర్‌పై పెడుతుంటా. పూర్తిస్థాయి స్క్రిప్ట్ సిద్ధమైతే దాన్ని భద్రంగా లాకర్‌లో పెట్టినట్టుగా దాచుకుంటూ ఉంటా. అవసరమైనప్పుడు వాటిని బయటకు తీస్తా. చిరంజీవి 'గాడ్‌ఫాదర్', నాని 'దసరా' చిత్రాల్లో నటిస్తున్నా" అని చెప్పారు సముద్రఖని.