Vijaya Devarakonda Liger Fight: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. ప్రస్తుతం విజయ్ సినీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం విజయ్ తన ఫిట్‌నెస్ మొత్తం మార్చుకొని రఫ్ లుక్‌లో ఓ ఎంఎంఏ ఫైటర్‌లా కనిపించాడు. ఇప్పటి వరకూ కరాటే, కుంగుఫూ, కిక్‌బాక్సింగ్ వంటి మార్షల్ ఆర్ట్స్ ఆధారంగా విడుదలైన చిత్రాలు ఓ ఎత్తైతే.. లైగర్ మరో ఎత్తు. ఎందుకంటే.. ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్‌టైసన్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. దీంతో విడుదలకు ముందే సినిమాకు మంచి హైప్ లభించింది. ఈ క్రమంలో ఎంఎంఏ కూడా ప్రజల్లో ఆసక్తి రేకెత్తించింది. సాధారణంగా మార్షల్ ఆర్ట్స్ గురించి తెలిసిన వారికి ఇది కొంత పరిచయం ఉంటుంది.. కానీ, సాధారణ ప్రజలకు పెద్దగా తెలియదు.
ఏమిటీ ఎంఎంఏ..?
ఎంఎంఏ (మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్) అనేది ఓ హైబ్రిడ్ యుద్ధ క్రీడ. బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, జుజిత్సు, కరాటే, థాయ్ బాక్సింగ్ వంటి యుద్ధ క్రీడల నుంచి తీసుకొన్న టెక్నిక్స్‌తో దీనిని అభివృద్ధి చేశారు. తొలిరోజుల్లో దీనిని ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఆడే అత్యంత క్రూరమైన క్రీడగా విమర్శకులు పేర్కొనేవారు. కానీ, కాలక్రమంలో ఎంఎంఏ ఆ చెడు ఇమేజీ నుంచి బయటపడి.. ప్రపంచంలో అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షించే క్రీడగా ఎదగడం మొదలైంది. చాలా దేశాలతో పాటు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఎంఎంఏపై ఆంక్షలు ఉన్నాయి. దీనిలో విజయం సబ్మిషన్, నాకౌట్, టెక్నికల్ నాకౌట్, న్యాయనిర్ణేతల ద్వారా తేలుతుంది.
వాస్తవానికి ఈ క్రీడ క్రీ.పూ 648లో పురాతన ఒలింపిక్స్ గేమ్స్‌లో కూడా ఆడినట్లు భావిస్తున్నారు. దీనిని గ్రీకుల యుద్ధ క్రీడగా భావిస్తారు. అప్పట్లో రెజ్లింగ్, బాక్సింగ్ కలగలిపి దీనిని ఆడేవారు. గ్రీక్ సైన్యానికి కూడా శిక్షణ ఇచ్చేవారు. క్రీ.శ 393లో రోమన్ చక్రవర్తి ఒలింపిక్స్‌ను బ్యాన్ చేశాక.. ఈ క్రీడ పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. 20వ శతాబ్దంలో బ్రెజిల్‌లోని వాలే ట్యూడో (ఏదైనా జరగొచ్చు అని అర్థం) ఆట ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చింది. కార్లో, హెలియో గ్రేసీ అనే సోదరులు ఉత్తర అమెరికాలో ప్రచారంలోకి తెచ్చారు. తర్వాత అమెరికాలోని కొలరాడో, డెన్వర్‌లలో నిర్వహించిన టోర్నిల్లో హెలియో కుమారుడ్ రాయిస్ గ్రేసీ పాల్గొన్నాడు. ఈ టోర్నికి 'యూఎఫ్‌సీ' అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ సంస్థే ఎంఎంఏ ప్రధాన ప్రచారకర్తగా ఎదిగింది. కాల క్రమంలో లక్షల మంది వీక్షకులు దీనికి లభించారు.
పటిష్ఠమైన నిబంధనలు..
ఎంఎంఏకు స్థిరమైన నిబంధనలు తీసుకొచ్చేలా యూఎఫ్‌సీ కృషి చేసింది. 2009 నాటికి అమెరికాలోని రెగ్యులేటరీ బాడీలు, ప్రపంచ స్థాయి సంస్థలు దీనిలో కొన్ని స్థిరమైన ప్రమాణాలను తీసుకొచ్చాయి. వీటిని ఎంఎంఏ యూనిఫైడ్ నిబంధనలుగా పిలుస్తారు. వీటి ప్రకారం ప్యాడ్స్ ఉన్న ఫింగర్‌లెస్ గ్లౌజులతో రింగ్ లేదా ఫెన్స్ మధ్యలోనే పోరాడాలి. బూట్లు వేసుకోకూడదు. తలకు ఎటువంటి కవచాలు ఉండకూడదు. అలానే ప్రత్యర్థి కంట్లో పొడవడం, కొరకడం, జుట్టు లాగడం, తలతో కొట్టడం వంటి పలు అంశాలపై నిషేధం ఉంది.