Oscar: 'ఛెల్లో షో' చైల్డ్ ఆర్టిస్ట్ కన్నుమూత - ఆస్కార్ ది లాస్ట్ ఫిల్మ్
11:04 October 11
'ఛెల్లో షో'లో చైల్డ్ ఆర్టిస్ట్ కన్నుమూత
చిత్రసీమలో విషాదం నెలకొంది. భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ బరిలోకి దిగుతున్న గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో'లో.. ప్రధాన పాత్ర పోషించిన రాహుల్ కోలి(15) కన్నుమూశాడు. క్యాన్సర్తో అతడు తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. కాగా, రాహుల్ మరణించినట్లు అతడి తండ్రి తెలిపారు. చనిపోయేముందు అతడు తీవ్ర జ్వరంతో బాధపడినట్లు పేర్కొన్నారు. "ఆదివారం అక్టోబర్ 2న, అతడు టిఫిన్ చేశాక తీవ్ర జ్వరం బారన పడ్డాడు. దాదాపు మూడు రక్తపు వాంతులు చేసుకున్నాడు. అలా బాధపడిన అతడు చనిపోయాడు. మా కుటుంబం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. మేము అక్టోబర్ 14న విడుదల కానున్న అతడి ఛెల్లో సినిమాను చూసిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తాం" అని తెలిపారు.
ఇక భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ బరిలోకి దిగుతున్న గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో'. అక్టోబరు 14న 'లాస్ట్ ఫిల్మ్ షో'గా ఇంగ్లిషులో విడుదలవుతోంది. ఇది ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో పోటీ పడుతోంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. "ప్రతిష్ఠాత్మక 95వ అకాడెమీ అవార్డుల చిత్రోత్సవాల్లో బరిలో ఉన్న మా సినిమాపై అంతా ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని 'లాస్ట్ ఫిల్మ్ షో'గా గురువారం రోజున 95 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. రూ.95లకే టికెట్ ధరను అందుబాటులో ఉంచుతున్నాం' అని దర్శకుడు పాన్ నళిన్ ఆ ప్రకటనలో తెలిపారు. సినిమాలంటే తీవ్రంగా అభిమానించే ఓ తొమ్మిదేళ్ల కుర్రాడి కథే ఈ చిత్రం. దర్శకుడు నళిన్ స్వీయ అనుభవాల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రాయ్‌కపూర్ ఫిల్మ్స్, జుగాడ్ మోషన్ పిక్చర్స్ పతాకాలపై సిద్ధార్థ్ కపూర్, ధీర్ మోమయా నిర్మించారు.
ఇదీ చూడండి: చిరంజీవి ఫ్యామిలీతో గొడవ.. అసలేం జరిగిందో చెప్పిన అల్లు అరవింద్