Indian Stars In Hollywood: భారతీయ సినిమా రేంజ్ మాత్రమే కాదు.. ఇండియన్ తారల స్థాయి కూడా హాలీవుడ్ రేంజ్‌కు చేరుతోంది. హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న భారతీయ తారల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొణె, ఈ మధ్య హ్యూమా ఖురేషీ, డింపుల్ కపాడియా, ప్రియాంక చోప్రా తదితరులు హాలీవుడ్ తెరపై కనిపించారు. తాజాగా 'హాలీవుడ్‌కి హాయ్' చెప్పడానికి సిద్ధమవుతున్న మరికొందరి నటుల గురించి తెలుసుకుందాం.
తూఫాన్ ప్రభావమెంతో..
దర్శకుడిగా, గీత రచయితగా, గాయకుడిగా, మంచి నటుడిగా.. శెభాష్ అనిపించుకున్న కథానాయకుడు ఫర్హాన్ అక్తర్. గతేడాది 'తూఫాన్'లాంటి విజయం అందుకున్నాడు. తాజాగా 'మిస్ మార్వెల్'తో హాలీవుడ్‌లో అడుగు పెడుతున్నాడు. డిస్నీ ప్లస్ కోసం రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఫిక్షన్ సిరీస్ ఇది. 'ఈ ప్రపంచం మనం నేర్చుకోవడానికి, ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఇస్తుంది. హాలీవుడ్‌లోకి అడుగుపెట్టడమూ అలాంటిదే. ఈ సిరీస్ పూర్తిస్థాయి వినోదం పంచుతుంది' అంటూ.. సామాజిక మాధ్యమాల్లో విషయం పంచుకున్నాడు.
సాహసాలతో షురూ..
అలియా భట్.. 'రాజీ', 'గంగూభాయ్ కాఠియావాడి'తో నటనలో తిరుగులేదనిపించుకుంది. అలాంటి అలియా 'నేను హాలీవుడ్‌లోనూ తెరంగేట్రం చేస్తున్నానోచ్' అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా మార్చిలో ప్రకటించింది. తను నటించబోయే స్పై థ్రిల్లర్ సినిమా పేరు 'హార్ట్ ఆఫ్ స్టోన్'. స్టార్ నటీనటులు గ్యాల్ గ్యాడోట్, జేమీ దోర్నన్‌లతో కలిసి తెర పంచుకోనుంది. టామ్ హార్పర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2023 జనవరిలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తామని సినీవర్గాలు ప్రకటించాయి.
ధనుష్ వెర్రెక్కిస్తాడా?
కొలవెరితో యువతను వెర్రెక్కించిన యాక్షన్ హీరో ధనుష్. ఎనిమిదేళ్ల కిందటే హిందీలోనూ 'రంఝనా'తో సత్తా చూపించాడు. ఇప్పుడు హాలీవుడ్ వంతు. 'ది గ్రే మ్యాన్'తో ఆ ముచ్చటా తీర్చుకోనున్నాడు. రూ.1,560 కోట్లతో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ థ్రిల్లర్, స్పై చిత్రం ఇది. ధనుష్‌తోపాటు రియాన్ గోస్లింగ్, క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మ్స్‌లాంటి హాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ నిర్మాణంలో దర్శక ద్వయం ఆంథోనీ, జో రూసో తెరకెక్కిస్తున్నారు. జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. 'ది గ్రేమ్యాన్'లో నటిస్తున్నందుకు గర్వంగా ఉంది. నా అభిమానుల్లాగే నేనూ దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నా పాత్ర నిడివి తక్కువైనా సినిమాలో ఇది కీలకం. యాక్షన్ సన్నివేశాలు తప్పకుండా అలరిస్తాయి' అని ధనుష్ ఈమధ్యే ట్వీట్ చేశాడు.