తన వ్యక్తిగత మేనేజరు డబ్బులు కాజేశాడంటూ ఇటీవల వచ్చిన వార్తలను ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నా కొట్టిపారేశారు. తమ ఇద్దరి మధ్య తగాదాలు వచ్చాయంటూ జరిగిన ప్రచారాన్ని ఆమె ఖండించారు. తామ మధ్య ఎటువంటి గొడవలు లేవని రష్మిక స్పష్టం చేశారు. 'మా ఇద్దరి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. మా దారులు వేరు. కెరీర్‌లో ఎవరికి వారు స్వయంగా ఎదగాలని అనుకున్నాం. అందువల్లే.. మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం. మేము ప్రొఫెషనల్స్. చేసే ఏ పనికి అయినా కట్టుబడి ఉంటాం' అని ఆమె తెలిపారు.
ఇంతకీ ఏంటి ఆ రూమర్స్..
సినిమా షూటింగుల్లో తీరిక లేకుండా బిజీగా గడుపుతున్న రష్మిక మందన్నాను.. ఆమె వ్యక్తిగత మేనేజరు ఆర్థికంగా మోసం చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. రష్మికకు తెలియకుండా.. దాదాపు రూ. 80 లక్షలు కాజేశాడని పలు వార్తా ఛానెళ్లు ప్రచారం చేశాయి. దీంతో తనను మోసం చేశాడన్న కారణంగా రష్మిక.. అతడిని ఉద్యోగంలో నుంచి తీసేశారంటూ వార్తలు వచ్చాయి. సినిమా కెరీర్ ఆరంభం నుంచి తనతోనే ఉన్న మేనేజరు చేసిన ఈ పనికి రష్మిక చాలా బాధ పడ్డారంటూ వివిధ రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారాలు ఎక్కువ అవుతున్న కారణంగా రష్మిక స్వయంగా స్పందించారు. తన మేనేజరుకు తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.