భారత వెండితెర.. భారీ సినిమాలకు వేదిక కాబోతోంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీసిన చిత్రం బాహుబలి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అశేష జనాదరణ కూడా పొందింది. దీంతో పాన్ ఇండియా చిత్రాలకు మలి దశ నాంది పలికినట్టయింది. ఇంతకముందు పాన్ ఇండియా చిత్రాలు అంటే హిందీ సినిమాలే.
కానీ ఇప్పుడు ప్రాంతీయ భాషల సినిమా పరిశ్రమలు జాతీయ, అంతర్జాతీయ సినిమాలు తీస్తున్నాయి. భారత సినిమా.. సరిహద్దులు చెరుపుకొని కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు నిర్మించేది ఇండియాలోనే. అలాంటిది భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాల బడ్జెట్, నటులు పారితోశకాలు కుడా భారీగానే ఉన్నాయి. సినిమా ప్రమోషన్ల, వేడుకలు.. ఖర్చుకు వెనకాడకుండా ఘనంగా నిర్వహిస్తున్నాయి. స్టార్ల పాత సినిమాల రీరిలీజ్‌లతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
అప్పట్లో కమల్ హాసన్ 'భారతీయుడు' చిత్రం ఘన విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా తీస్తున్న 'భారతీయుడు2' చిత్రం షూటింగ్ విరామం తర్వాత రీస్టార్ట్ అయ్యింది. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్‌లో కూడా దీని గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. ఈ సినిమాలో కమల్ హాసన్ భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారట. మొత్తంగా రూ.150 కోట్ల అందుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి సమాచారం వెలువడలేదు.
అయితే భారతీయుడు 2 భారీ తారాగణంతో తెరకెక్కుతోంది. ఇందులో కమల్ సరసన కాజల్ నటిస్తోంది. రకుల్ ప్రీత్‌సింగ్, ఐశ్వర్య రాజేశ్, వెన్నెల కిశోర్, సిద్ధార్థ్ ప్రాధాన పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్, ధర్మ ప్రొడక్షన్స్, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలందిస్తున్నారు.