Indian 2 Intro :తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ - ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఇండియన్-2'. 'భారతీయుడు'కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలో మూవీయూనిట్ 'ఇండియన్ ఇంట్రో' పేరుతో శుక్రవారం ఓ వీడియో రిలీజ్ చేసింది. 1.58 నిమిషాల నిడివిగల ఈ వీడియో నిమిషాల్లోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. మరి మీరు ఆ వీడియో చూశారా?
వీడియోలో ఏముంది?హలో! 'ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను.. భారతీయుడుకు చావే లేదు' అంటూ కమల్ హాసన్ డైలాగ్‌తో వీడియో స్టార్ట్ అవుతుంది. అయితే సొసైటీలో వివిధ శాఖల్లో అవినీతి జరుగుతున్నట్టు ఈ గ్లింప్స్‌లో చూపించారు. అయితే సమాజంలో ఏ మార్పు రావట్లేదు, ఏ ఒక్కరూ మారట్లేదని భావించే ప్రజలు.. భారతీయుడు మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటారు. దీంతో 'కమ్‌బ్యాక్ ఇండియన్' అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతారు. అయితే సామాన్యుల కష్టాలు తీర్చడానికి భారతీయుడు ఎలా వస్తాడు? సమాజంలో అవినీతిని ఎలా అరికడతాడు? దేనిపై పోరాడుతాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!
అయితే 'ఇండియన్ - 2' తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ క్రమంలో మూవీయూనిట్.. ఆయా ఇండస్ట్రీల్లోని ప్రముఖులను, 'సినిమా ఇంట్రో' వీడియో కార్యక్రమంలో భాగస్వాములను చేసింది. ఈ నేపథ్యంలో తెలుగులో సినిమా గ్లింప్స్‌ను ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి, తమిళ్లో సూపర్‌స్టార్ రజనీకాంత్, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్‌లాల్ తమతమ అధికారిక ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేశారు.