India Costly Advertisement : మీరు ఇప్పటి దాకా కాస్ట్లీ సినిమాల గురించి విన్నారు. కానీ కాస్ట్లీ యాడ్స్ గురించి విని ఉండరు. అదేంటి.. అలాంటి యాడ్స్ కూడా ఉంటాయా అంటే.. అవును ఉంటాయనే సమాధానం వస్తుంది. మామూలుగా ఒక యాడ్ తీస్తే మహా అయితే రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇంకా ఎక్కువంటే అన్నీ ఖర్చులు కలిపి రూ.10 కోట్ల వరకు అవుతుంది. కానీ, ఒక్క యాడ్ కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చుపెట్టారంటే మీరు నమ్ముతారా? అది కూడా మన భారత్‌లోనే. చదవడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. ఆ యాడ్ కూడా ఎందుకు తీశారో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.!
మ్యాగీకి పోటీగా 'చింగ్'!
కంపెనీలు తమ కార్లు, ఆభరణాలు, టీవీలు, సెల్ ఫోన్ల గురించి యాడ్స్ కోసం ఎంతో డబ్బును ఖర్చు చేస్తాయి. అయితే FMCG కంపెనీ అయిన మ్యాగీ(Maggi)కి పోటీగా తీసుకువచ్చిన 'చింగ్ నూడుల్స్' అనే ప్రోడక్ట్ కోసం ఏకంగా రూ.75 కోట్లను ఖర్చు చేసి యాడ్ చేయించుకుంది సంస్థ. ఈ యాడ్‌కు చెన్నై ఎక్స్‌ప్రెస్ లాంటి హిట్ ఇచ్చి, ఇటీవలి కాలంలో బాలీవుడ్లో యాక్షన్ సీక్వెన్స్‌లో భారీ మార్పులు తీసుకొచ్చిన డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ యాడ్‌కు ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ సైతం మద్దతును తెలియజేసింది. అయితే ఈ యాడ్‌లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించారు. నటుల పారితోషికం, ఉపయోగించిన వీఎఫ్ఎక్స్ సహా ఇతరత్రా ఖర్చంతా కలిసి బడ్జెట్ రూ.75 కోట్లకు పెరిగింది.
యాడ్‌లో సాంగ్.. 2 గంటల్లో 20 లక్షల వ్యూస్..
సాధారణంగా ఏ ప్రకటన అయినా.. మహా అయితే 2 నిమిషాలు ఉంటుంది. కానీ 'చింగ్ నూడుల్స్' యాడ్ మాత్రం ఏకంగా 5 నిమిషాల 30 సెకన్ల నిడివితో ఉంది. పైగా ఇందులో ఒక పాట కూడా ఉండటం విశేషం. దీనికి 'రణ్వీర్ చింగ్ రిటర్న్స్' అనే టైటిల్‌ను కూడా పెట్టారు. కాగా, 'మై నేమ్ ఈజ్ రణ్వీర్ చింగ్' యాడ్‌గా ఇది బాగా పాపులరైంది. 2016 ఆగస్టు 28న టెలికాస్ట్ అయిన ఈ యాడ్.. విడుదలైన 2 గంటల్లోనే యూట్యూబ్‌లో ఏకంగా 2 మిలియన్ల (20 లక్షలు) వ్యూస్‌ను దక్కించుకుంది.