తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అప్పుడు చాలా బాధపడ్డా.. దాని విలువేందో అర్థమైంది: చిరంజీవి - చిరంజీవి ఐఎఫ్ఎఫ్​ఐ అవార్డు

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ) ముగింపు ఉత్సవాలకు నటుడు చిరంజీవి తన సతీమణితో హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవంలో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేకపోవడంపై చాలా బాధపడ్డానని, ఇప్పుడు అవార్డుల అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

IFFI 2022
ముగింపు ఉత్సవాల్లో భార్యతో కలిసి చిరంజీవి సందడి

By

Published : Nov 28, 2022, 6:34 PM IST

Updated : Nov 28, 2022, 9:44 PM IST

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ) ముగింపు ఉత్సవాలకు నటుడు చిరంజీవి తన సతీమణితో హాజరయ్యారు. ఇటీవల ప్రకటించిన అవార్డుల్లో చిరంజీవికి 'ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ - 2022' పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారాన్ని అందుకోవడానికి ఆయన గోవాకు వెళ్లారు.

"ఇక్కడికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు నాకు ప్రదానం చేసినందుకు భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. గొప్పగా భావిస్తున్నాను. ప్రత్యేకంగా నిలిచే అవార్డుల్లో ఇదొకటి. ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నా. సరైన సమయంలోనే నాకు అవార్డు ఇచ్చారని భావిస్తున్నా. నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. సినీ పరిశ్రమలోకి రాకముందు నేను కొణిదెల శివశంకర ప్రసాద్​. ఇప్పుడు నా అభిమానుల వల్ల మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగాడు. నన్ను కన్న నా తల్లిందండ్రులకు, చిరంజీవిగా పునర్జన్మనిచ్చిన సినీ పరిశ్రమకు నేనెప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాను. 45ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నా. రాజకీయంలోకి వెళ్లడం వల్ల కొన్నాళ్లు గ్యాప్‌ వచ్చింది. పాలిటిక్స్‌లోకి వెళ్లడం వల్ల సినిమా విలువేంటో అర్థమైంది. ఏ రంగంలో అయినా అవినీతి ఉండొచ్చు. కానీ, చిత్ర పరిశ్రమలో లేదు. ఇక్కడ ప్రతిభ ఒక్కటే కొలమానం. రీ ఎంట్రీ సమయంలో ప్రేక్షకులకు ఎలా ఆదరిస్తారోననే సందేహం ఉండేది. కానీ, ఎప్పటిలానే నాపై ప్రేమ చూపారు. వారి ప్రేమకు నేను దాసుణ్ని. జీవితాంతం చిత్ర పరిశ్రమలోనే ఉంటా. గతంలో జరిగిన చలన చిత్రోత్సవ వేడుకలకు ఓసారి వచ్చా. దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫొటో కూడా లేదని చాలా బాధపడ్డా. సినిమా ఎక్కడైనా తీయొచ్చు. కానీ, అది భారతీయ సినిమా అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది.నాకు యువ హీరోలు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ. వాళ్లకు ఇప్పుడు కష్టకాలమే" అని పేర్కొన్నారు. కాగా, ఈ గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలకృష్ణ నటించిన 'అఖండ', అడవి శేష్ 'మేజర్' సినిమాలతో పాటు 'సినిమా బండి', 'ఖుదీరాం బోస్' మూవీస్ 'పనోరమా' కేటగిరిలో స్పెషల్ స్క్రీనింగ్ అయ్యాయి.

ఇదీ చూడండి:చిరంజీవిపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం.. ఎందుకంటే?

Last Updated : Nov 28, 2022, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details