ఆయన కలం కదిపితే చాలు.. కలెక్షన్ల కోటలు బద్దలయ్యే కథలు పుడతాయి.. ఆయన కథనాన్ని రచిస్తే.. చూస్తున్న ప్రేక్షకుల హోరుతో థియేటర్లు దద్దరిల్లుతాయి.. తెలుగుజాతి ఖ్యాతిని పెంచిన ఎన్నో కథల సృష్టికర్త.. భరతజాతి గర్వించే దర్శకుడిని కన్న మహా రచయిత.. ఆయనే కె.వి.విజయేంద్రప్రసాద్. అయితే ఇటీవలే గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దర్శకనిర్మాతలు, రచయితలకు కొన్ని సూచనలు చేశారు. తాను సినిమాలకు ఎలా కథలు రాస్తారో వివరించారు. ఇంకా తన కెరీర్ ఎలా ప్రారంభమైందో కూడా చెప్పారు.
"నేను సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్‌ను. నేను రచయిత కాకముందు జీవించడానికి దొరికిన ప్రతి పనిని చేశాను. వ్యవసాయం, ఎరువుల వ్యాపారం.. ఓ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించాను. కానీ వర్కౌట్ కాలేదు. అయితే నేను రచయిత ద్వయం సలీమ్-జావెద్‌కు వీరాభిమానిని. వారు కథ అందించిన 'షోలే' సినిమా చూశాను. ఎంతో బాగా నచ్చింది. అప్పు చేసి మరీ ఆ సినిమా క్యాసెట్‌ను అద్దెకు తెచ్చుకుని మళ్లీ మళ్లీ చూసేవాడిని. సలీమ్-జావెద్.. భావోద్వేగాలు ఉండేలా పాత్రలను ఎలా సృష్టిస్తారో నేను నేర్చుకున్నాను. ఇప్పటికీ నేను ఓ కథ రాసేటప్పుడు 'షోలే' సినిమాలోని కనీసం రెండు మూడు సన్నివేశాలను చూస్తాను. నా 40ఏళ్ల వయసులో 1988-1989లో రాయడం ప్రారంభించాను. అప్పుడు స్క్రిప్ట్ ఎలా రాయాలో నేర్చుకునే సమయం లేదు. అలానే స్కూల్‌కు వేళ్లే టైమ్ లేదు. అందుకే షార్ట్‌కట్స్‌ను వెతికాను. ఎన్టీరామారావు, జెమినీ గణేశన్, సావిత్రి, రంగారావు నటించిన క్లాసిక్ సినిమా 'మాయాబజార్'. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఎంతో ఫర్ఫెక్ట్. అద్భుతంగా తెరకెక్కించారు. ఒక్క సింగిల్ షాట్ కూడా వేస్ట్ అవ్వలేదు. నా కథలపై ఆ చిత్ర ప్రభావం కూడా ఉంది. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా నా కథలోని పాత్రలు సృష్టించడానికి నిత్యం ప్రయత్నిస్తుంటాను. ఆ తపనే నా చేత ప్రత్యేకమైన, భిన్నమైన, ప్రేక్షకుడ్ని ఆకట్టుకునేలా పాత్రను క్రియేట్ చేసేలా చేస్తుంది.