ఈ సారి 'వీరసింహారెడ్డి, 'వాల్తేరు వీరయ్య'లతో కలిసి డబుల్ ధమాకాలా సందడి చేసింది శ్రుతిహాసన్. 'వారసుడు'తో కలిసి పండగకొచ్చింది రష్మిక. 'కళ్యాణం కమనీయం'తో మరో కొత్త శోభని మోసుకొచ్చింది ప్రియభవానీ శంకర్. తెలుగింట సంక్రాంతి సరస విరసమైన సంబరాల మధ్య సాగుతుంటుంది. వెండితెరపై సరసాలు, విరసాలతో వినోదాన్ని పంచుతూ సంబరాల్లో ప్రధాన భాగం అవుతుంటారు..
పండగ పూట ప్రేక్షకుల్ని అలరించిన ముద్దుగుమ్మలు.. ఈ ఏడాది 'సంక్రాంతి' సొగస్కాంతులు వీళ్లే.. - సంక్రాంతి సంబరాల్లో ప్రియ భవానీ శంకర్
ఈ సంక్రాంతి సొగస్కాంతలు వీళ్లే.. ఈ పండగ పూట ప్రేక్షకుల్ని అలరించింది వీళ్లే! ఈ ముగ్గుల పండక్కొచ్చిన సినిమాల్లో హంగులు ఎన్నెన్నో.. అందులో అందాల రంగులు వెదజల్లింది మాత్రం వీళ్లే! గొబ్బెమ్మలతో తెలుగు లోగిళ్లు ఎంత కళని సంతరించుకున్నాయో.. తెరపైన ఈ ముద్దుగుమ్మల సందడిలోనూ అంతే కోలాహలం. సంక్రాంతి కథానాయిక అంటే అంతే మరి! ఈ పండగకి వాళ్ల సందడి ఎలా ఉంటుందో చెబుతున్నారు.
సంక్రాంతి సరదాల గురించి చెప్పమంటే చాలు. .శ్రుతి హాసన్ బోలెడన్ని జ్ఞాపకాల్ని ఆవిష్కరించింది. ఉత్తరాదిలో ఉన్నా, దక్షిణాదిలో ఉన్న నేను తప్పకుండా జరుపుకునే పండగ సంక్రాంతి అని చెప్పుకొచ్చింది శ్రుతి. ''నా బాల్యం చెన్నైలోనే గడిచింది. అక్కడ పొంగల్ సందడి అంటే నాకు నాన్న సినిమాతోనే మొదలయ్యేది. మా నాన్న కమల్‌హాసన్ నటించిన ఏదో ఒక చిత్రం విడుదలయ్యేది. సినిమా చూడటం, చక్కెర పొంగళి తినడం.. పండగ సంబరాల్ని ఆస్వాదించడం. ఇదే నా పండగ. నేను హీరోయిన్‌ని అయ్యాక పండగ జరుపుకునే విధానం కాస్త మారిందేమో గానీ, సంబరాలు మాత్రం ఆగలేదు. కొన్నేళ్లుగా ముంబయిలో ఉంటున్నా. అక్కడ కూడా ఈ సంరంభాన్ని లోహ్రిగా జరుపుకుంటారు. అలా ఎక్కడున్నా నేను సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకుంటుంటా'' అంటోంది శ్రుతిహాసన్.
మరో కథానాయిక రష్మిక అయితే సంక్రాంతి నాకు ఎప్పటికప్పుడు మరింత ప్రత్యేకంగా మారిపోతోందని చెబుతోంది. ''తెలుగులో సంక్రాంతికొచ్చిన నా తొలి సినిమా.. 'సరిలేరు నీకెవ్వరు'. పండగ పూట మన సినిమా కూడా విడుదల అయిందంటే ఆ సంబరాలు రెట్టింపవుతుంటాయి. ఈ పండక్కి నాకు కొడగు రోజులే గుర్తొస్తాయి. కానీ కొన్నేళ్లుగా తెలుగు సంక్రాంతి సంబరాల్ని కూడా ఆస్వాదిస్తున్నా'' అని చెప్పుకొచ్చింది. కొత్త భామ ప్రియ భవానీ శంకర్ ''నా తొలి తెలుగు సినిమా సంక్రాంతికి విడుదల కావడం నాకు మరింత ప్రత్యేకం'' అంది.