Hombale Films RCB Join Hands: భారతీయ చిత్రసీమలో హోంబాళి ఫిల్మ్స్- ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ రెండిటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకటి సినిమాలో.. మరొకటి క్రికెట్లో సరికొత్త వినోదాన్ని అందించడంలో ఎప్పుడూ ముందుంటాయి. అయితే ఇప్పుడీ రెండు సంస్థలు కలిసి రెట్టింపు వినోదాన్ని పంచేందుకు చేతులు కలిపాయి. సినిమాలు, క్రీడలు, లైఫ్‌స్టైల్ వంటి అంశాల్లో కలిసి పనిచేయనున్నట్లు తెలిపాయి. మల్టీ ఫార్మాట్ కంటెంట్ కోసం భాగస్వామ్యం అవుతున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఓ పవర్ఫుల్ వీడియోను పోస్ట్ చేశాయి. భవిష్యత్తులో తాము చేయబోయే ప్రాజెక్ట్‌ల వివరాల గురించి త్వరలోనే తెలియజేస్తానని ఈ రెండు సంస్థలు తెలిపాయి.
ఇక ఈ వీడియో.. 'కేజీఎఫ్ 2' ట్రైలర్‌కు మించి ఉంది! 'కేజీఎఫ్'లోని పాత్రలను ఆర్సీబీ ఆటగాళ్లతో పోలుస్తూ ఈ వీడియోను రూపొందించారు. పవర్ఫుల్ 'అధీరా' క్యారెక్టర్లో నటించిన సంజయ్ దత్తో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, హీరో యశ్‌తో కింగ్ కోహ్లీ, రవీనా టాండన్‌తో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కాంబినేషన్లను చూపించారు. వీడియో చివర్లో 'దేశానికి వినోదం పంచేందుకు బెంగళూరులో జన్మించాం' అనే డైలాగ్‌ను ఆర్సీబీ ప్లేయర్లు చెప్పటం వీడియోకు హైలైట్‌గా నిలిచింది.
'కేజీఎఫ్ 2' రూట్ మ్యాప్: 'కేజీఎఫ్ 2' విషయానికొస్తే ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కానుంది. దీనికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్రబృందం శరవేగంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ దేశవ్యాప్తంగా పర్యటన చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు వీరు రానున్నారు. దీనికి సంబంధించిన రూట్‌మ్యాప్‌ను కూడా విడుదల చేసింది. ఏప్రిల్ 10 సాయంత్రం 6.30గంటలకు తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. 11వ తేదీ ఉదయం 8గంటలకు శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అదే రోజు 11.30గంటలకు వైజాగ్‌లో ప్రెస్‌మీట్, సాయంత్రం 7గంటలకు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.