తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

RRRకు అవార్డుల పంట.. 'బ్యాట్‌మాన్‌', 'టాప్‌గ‌న్‌'ను వెనక్కినెట్టి మరీ.. - RRR best action flim

అంత‌ర్జాతీయ వేదిక‌పై ఆర్​ఆర్​ఆర్​ ప‌లు ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డుల‌ను సొంతం చేసుకొని చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్‌తో పాటు ప‌లు హాలీవుడ్ అవార్డుల‌ను కైవ‌సం చేసుకున్న‌ ఈ సినిమాకు మరో నాలుగు అవార్డులు వరించాయి

hollywood critics association best action film awards goes to RRR
hollywood critics association best action film awards goes to RRR

By

Published : Feb 25, 2023, 10:06 AM IST

Updated : Feb 25, 2023, 3:08 PM IST

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్​ఆర్​ఆర్​ సినిమా హవా హాలీవుడ్​లో కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్​ గ్లోబ్​, క్రిటిక్స్​ ఛాయిస్​ అవార్డులు వరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా హాలీవుడ్​ క్రిటిక్స్​ అసోసియేషన్​ అవార్డుల్లో ఆర్​ఆర్​ఆర్​ సత్తా చాటింది. బెస్ట్​ యాక్షన్​ ఫిల్మ్​, బెస్ట్​ ఇంటర్నేషనల్​ ఫీచర్​ ఫిల్మ్​, బెస్ట్​ ఒరిజినల్ సాంగ్​తోపాటు స్టంట్​ విభాగాల్లో ఆర్​ఆర్​ఆర్​ అవార్డులను కైవసం చేసుకుంది.

బెస్ట్​ యాక్షన్​ ఫిల్మ్​ క్యాటగిరీలో టాప్​ గన్​, బ్యాట్​మాన్​ వకండా ఫరెవర్​ లాంటి హాలీవుడ్​ బిగ్గెస్ట్​ ఫిల్మ్​ను దాటేసి ఆర్​ఆర్​ఆర్​ ఆవార్డును దక్కించుకోవడం గమనార్హం. ఈ క్యాటగిరీలో జ్యూరీ మెంబర్స్​ ఆర్​ఆర్​ఆర్​కే ఓటు వేశారు. బెస్ట్​ స్టంట్స్​ క్యాటగిరీలో ఈ సినిమాకే అవార్డు వచ్చింది. అలాగే బెస్ట్​ ఒరిజినల్​ సాంగ్​ విభాగంలో నాటు నాటు పాట కూడా అవార్డును గెలుచుకుంది. బెస్ట్​ ఇంటర్నేషనల్​ ఫీచర్​ ఫిల్మ్​ విభాగంలో పలు దేశాల సినిమాలతో పోటీపడి ఆర్​ఆర్​ఆర్​ అవార్డు అందుకుంది. ఈ హాలీవుడ్​ క్రిటిక్స్​ అసోసియేషన్​ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో హీరో రామ్​చరణ్​, రాజమౌళి, కీరవాణితో పాటు ఆర్​ఆర్​ఆర్​ టీమ్​ మొత్తం పాల్గొన్నారు.

"ఆర్‌ఆర్‌ఆర్‌కు బెస్ట్‌ స్టంట్స్‌ అవార్డును అందించిన హెచ్‌సీఏ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఎంతగానో శ్రమించి ఇందులో స్టంట్స్‌ కొరియోగ్రఫీ చేసిన సాల్మన్‌, క్లైమాక్స్‌లో కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లు కంపోజ్‌ చేసిన జూజీతోపాటు మా సినిమా కోసం భారత్‌కు వచ్చి.. మా విజన్‌ అర్థం చేసుకుని.. మాకు అనుగుణంగా మారి.. కష్టపడి పనిచేసిన ఇతర స్టంట్‌ మాస్టర్స్‌ అందరికీ కృతజ్ఞతలు. సినీ ప్రియులను అలరించడం కోసం స్టంట్స్‌ మాస్టర్స్‌ ఎంతో శ్రమిస్తుంటారు. కాబట్టి ఈ సభా ముఖంగా ప్రతిష్ఠాత్మక అవార్డులు అందించే బృందాలకు నాది ఒక చిన్న విన్నపం. ఇకపై మీ అవార్డుల జాబితాలో స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ విభాగాన్ని కూడా చేర్చాలని నేను కోరుతున్నాను. సినిమాలోని రెండు, మూడు షాట్స్‌లో మాత్రమే డూప్స్‌ని ఉపయోగించాం. మిగతావన్నీ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌నే స్వయంగా చేశారు. వాళ్లిద్దరూ అద్భుతమైన వ్యక్తులు. 320 రోజులపాటు ఈచిత్రాన్ని షూట్‌ చేయగా.. అందులో ఎక్కువ భాగం స్టంట్స్‌ కోసమే పనిచేశాం. ఇది కేవలం నాకు, నా చిత్రానికే కాదు మా భారతీయ చిత్రపరిశ్రమకు దక్కిన గౌరవం. మేరా భారత్‌ మహాన్‌. జై హింద్‌" అని రాజమౌళి తెలిపారు. "నాటు నాటుకు అవార్డును అందించిన హెచ్‌సీఏ వారికి ధన్యవాదాలు. ఇలాంటి గొప్ప గౌరవాన్ని నాకు సొంతమయ్యేలా చేసిన రాజమౌళికి థ్యాంక్యూ" అంటూ కీరవాణి పాట పాడారు.

ఆర్​ఆర్​ఆర్​ తాజాగా నాలుగు అవార్డులు గెలుచుకోవడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూవీటీమ్​కు అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే ఆస్కార్‌ సాధించాలని కోరుకుంటున్నారు. కాగా, ఈ సినిమా 'ఆస్కార్‌' బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో నాటు నాటు పాటకు ఆస్కార్​ నామినేషన్​ లభించింది.

కాగా, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. అలియాభట్‌, అజయ్‌ దేవగణ, శ్రియ, ఒలివియా మోర్రీస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా గతేడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా రూ.1200కోట్లు వసూలు చేసింది.

Last Updated : Feb 25, 2023, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details