Highest Collected Bollywood Movie In South :దక్షిణాది ప్రజలకు సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే రాష్ట్రానికొక ఇండస్ట్రీ ఉంది. అన్ని సినిమాలు చూస్తారు. కానీ బీటౌన్ సినిమాల్ని పెద్దగా ఆదరించరు. మన మూవీస్‌ని వాళ్లు తక్కువ అంచనా వేయడం, నటుల్ని చిన్న చూపు చూడటం లాంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. దీనికి తోడు గతంలో లాగా బీ టౌన్ నుంచి మంచి చిత్రాలు రావడం తగ్గింది. అందుకే మన వాళ్లు వాటిని పట్టించుకోవట్లేదు. కానీ ఇటీవల వచ్చిన ఒక బాలీవుడ్ సినిమాను సూపర్ హిట్ చేశారు దక్షిణాది ప్రేక్షకులు.
రెండు ఇండస్ట్రీల మధ్య..
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన 'జవాన్' సినిమా సౌత్‌లో మంచి కలెక్షన్లు రాబట్టింది. తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1069.85 కోట్లు, మన దేశంలో రూ.640.42 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. ఇంకా కొన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతూ జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి, నయనతార వంటి అగ్ర నటీనటులూ నటించారు. ఇక హిందీ చిత్రానికి ఈ మేర కలెక్షన్స్‌ను తెచ్చిపెట్టిన సౌత్ ఆడియెన్స్ రెండు ఇండస్ట్రీల మధ్యనున్న అంతరాన్ని తగ్గించందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మూడో బాలీవుడ్ చిత్రంగా..
ఈ చిత్రం అటు బాలీవుడ్లోనే కాకుండా.. ఇటు సౌత్‌లోనూ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో సూపర్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్ సినిమాల లాగే మంచి హైప్ క్రియేట్ చేసి ప్రజాదరణ పొందడంలో సక్సెస్ సాధించింది షారుక్ 'జవాన్'. 'బాహుబలి- 2', 'కేజీఎఫ్- 2', 'ఆర్ఆర్ఆర్' సినిమాల తర్వాత రూ.వెయ్యి కోట్లు సాధించిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. మొత్తంగా 'దంగల్', 'పఠాన్' తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బాలీవుడ్ చిత్రంగా 'జవాన్' నిలిచింది.