Hideo Kojima Rajamouli: హిడియో కొజిమా.. ఈ పేరు భారతీయులకు పెద్దగా పరిచయం లేదు. వీడియో గేమ్స్ ఆడేవారికి తప్ప ఆయనేం చేస్తారో నిన్నటి (గురువారం) వరకూ చాలామందికి తెలియదు. కానీ, ఇప్పుడు ఆయన పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆయన భారతీయ సినిమాలకు వీరాభిమాని అని కొన్ని కోట్ల మందికి తెలిసింది. దీనికి కారణం 'ఆర్‌ఆర్‌ఆర్'. అదెలా అంటారా? ఈ సినిమా జపాన్‌లో శుక్రవారం విడుదలైంది. సంబంధిత ప్రచారం కోసం హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి అక్కడికి వెళ్లారు.
సాధారణ వ్యక్తులేకాదు హిడియో కొజిమాలాంటి ప్రముఖులూ 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్‌ను కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ట్విటర్ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజమౌళితో కలిసి దిగిన ఫొటోలను హిడియో షేర్ చేస్తూ.. ''బాహుబలి' సృష్టికర్త ఎస్. ఎస్. రాజమౌళి తాజా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదలైంది. 'టాప్‌గన్: మావెరిక్'లా ఎంటర్‌టైన్ చేస్తుంది. తప్పకుండా చూడండి'' అని అక్కడి ప్రేక్షకులను కోరారు.
రాజమౌళి సైతం హిడియోతో కలిసి దిగిన ఫొటోలు పంచుకున్నారు. దాంతో హిడియో గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. హిడియో మరెవరో కాదు ప్రముఖ వీడియో గేమ్ డైరెక్టర్, క్రియేటర్. 'మెటల్ గేర్', 'స్నాచర్', 'మెటర్ గేర్ 2: సాలిడ్ స్నేక్', 'పోలీస్‌నాట్స్', 'మెటల్ గేర్ ఆన్‌లైన్', 'డెత్ స్ట్రాడింగ్' వంటి ఎన్నో పాపుల్ గేమ్స్‌ను సృష్టించారు. ఈ గేమ్స్ రూపొందే 'కొజిమా ప్రొడక్షన్స్'ను రాజమౌళి సందర్శించారు.
'ఆర్‌ఆర్‌ఆర్' విడుదల సందర్భంగా ఇండియన్ సినిమాపై తనకున్న ఇష్టాన్ని హిడియా ఇలా వివరించారు. ''జపాన్‌లో 1998లో 'ముత్తు' సినిమా విడుదలైంది. అప్పటి నుంచి భారతీయ చిత్రాలు చూడటం ప్రారంభించా. రజనీకాంత్ యాక్టింగ్‌కు ఫిదా అయ్యా. ఆ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (ఓఎస్టీ)నీ కొన్నా. ఆ తర్వాత రజనీకాంత్ 'రోబో', ఆమిర్‌ఖాన్ హీరోగా వచ్చిన '3 ఇడియట్స్', 'దంగల్', 'పీకే' చిత్రాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఆ జాబితాలోకి ఇటీవల 'బాహుబలి' చేరింది'' అని హిడియా తెలిపారు.