Hi Nanna Review In Telugu : సినిమా: హాయ్ నాన్న; నటీనటులు: నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్ బేబీ, విరాజ్ అశ్విన్, శ్రుతిహాసన్ తదితరులు; సంగీతం: హషీమ్ అబ్దుల్ వాహబ్; సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్; ఎడిటింగ్: ప్రవీణ్ ఆంటోనీ; నిర్మాత: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్.; రచన, దర్శకత్వం: శౌర్యువ్; సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్; విడుదల: 07-12-2023
సినిమా సినిమాకీ సంబంధం లేకుండా ఇమేజ్, ట్రెండ్ అంటూ లెక్కలేసుకోకుండా కథల్ని ఎంచుకుంటూ ప్రయాణం చేస్తున్న నేచురల్ స్టార్ నాని. దసరా మూవీతో మాస్ అవతారాన్ని ప్రదర్శించారు. ఆ వెంటనే దానికి పూర్తి భిన్నమైన ఓ తండ్రీ కుమార్తె కథను ఎంచుకుని 'హాయ్ నాన్న' చేశారు. కొత్త దర్శకులతో సినిమాలు చేయడంలో ముందుండే ఈ హీరో మరోసారి అదే పంథాలో అడుగులు వేస్తూ శౌర్యువ్ అనే దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు. విడుదలకి ముందే నాని - మృణాల్ జోడీ, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది?తండ్రీ-కూతుళ్ల పాత్రలు భావోద్వేగాలను పంచాయా?
స్టోరీ ఎంటంటే?
విరాజ్ (నాని) ముంబయిలో ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. పుట్టినప్పటి నుంచే జబ్బుతో బాధపడుతున్న తన కూతురు మహి (కియారా)నే ప్రపంచంగా బతుకుతుంటాడు. కూతురికి సరదాగా కథలు చెప్పడం విరాజ్‌కి అలవాటు. ఆ స్టోరీల్లో హీరోగా నాన్నని ఊహించుకుంటూ ఉంటుంది. ఓ రోజు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తే చెబుతానంటాడు. అమ్మ కథ కోసం కష్టపడి చదివి క్లాస్ ఫస్ట్ వస్తుంది. అయినా మహికి తన అమ్మ కథని చెప్పడు విరాజ్. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది మహి. రోడ్డుపై ప్రమాదం నుంచి ఆ చిన్నారిని కాపాడుతుంది యష్న (మృణాల్ ఠాకూర్). ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులు అవుతారు. తన కూతురుని వెదుకుతూ వచ్చిన విరాజ్‌కి యష్నతో కలిసి ఓ కాఫీ షాప్‌లో కనిపిస్తుంది. అక్కడే విరాజ్ మహికి తన అమ్మ కథని చెబుతాడు. ఈసారి కథలో తన అమ్మ వర్ష పాత్రని యష్నలో ఊహించుకుంటుంది మహి. ఇంతకీ ఆ వర్ష ఎవరు? కూతురు మహిని వదిలి దూరంగా ఎందుకు ఉంది?యష్నకీ, మహి తల్లికీ సంబంధం ఏమిటి? పెళ్లి నిశ్చయమైన యష్న విరాజ్‌ని ఎలా ప్రేమించింది? ఆ ప్రేమ నిలబడిందా? చిన్నారి తన తల్లి చెంతకి చేరిందా లేదా? వంటి తదితర విషయాలు తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే?
అమ్మానాన్నల ప్రేమకథ ఇది. ఈ నేపథ్యంలో సాగే కథలు టాలీవుడ్లో కొత్తేం కాదు. కానీ, ఇందులోని ప్రేమకథలో మలుపులు కొత్తగా ఉంటాయి. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు బలంగా నిలుస్తాయి. చిన్నారి తన అమ్మగా కథానాయికని ఊహించుకోవడం మొదలైనప్పటి నుంచే ఈ స్టోరీ ఏ దిశగా సాగుతుందో ప్రేక్షకుడు ఓ అంచనాకి వస్తాడు. అయినా సరే సీన్స్ ఓ ప్రేమకథకి కావల్సిన సంఘర్షణని పండిస్తాయి. ట్విస్ట్‌లు, ఎమోషన్స్ సినిమాని మరో స్థాయికి తీసుకెళతాయి. అయితే ఇందులో ఆవిష్కరించిన ప్రేమలోనే బలం తగ్గినట్టు అనిపిస్తుంది. నిజానికి రెండు ప్రేమకథలు ఇందులో ఉంటాయి. విరాజ్ - వర్ష కథ ఒకటి, విరాజ్ - యష్న కథ మరొకటి. ఆ రెండు ప్రేమల్లో కనిపించాల్సిన మేజిక్, జంట మధ్య కెమిస్ట్రీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రథమార్ధం కాస్త నిదానంగా సాగుతుంది. ప్రేమలో పడటం, విడిపోవడం వంటివి సాధారణంగానే అనిపిస్తాయి తప్ప పెద్దగా అనుభూతిని పంచవు. వర్ష కథ విని యశ్న విరాజ్‌తో ప్రేమలో పడటం, ఆ తర్వాత మహి ఎవరి కూతురు అనే మలుపు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. ద్వితీయార్ధంలో పండే భావోద్వేగాలతో మళ్లీ దర్శకుడు కథపై పట్టు ప్రదర్శించాడు.