Hi Nanna Pre Release Event :నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్లో రూపొందిన తాజా చిత్రం 'హాయ్ నాన్న'. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో ఈ సినిమాను డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కించారు. ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచగా.. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరో ప్రత్యేకతను సంతరించుకుంది. డిసెంబరు 7న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న సందర్భంగా వైజాగ్‌లో మూవీ టీమ్ ఓ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఇక ఈ వేడుకకు నాని,మృణాల్తో పాటు బేబి కియార హాజరై సందడి చేశారు. మూవీ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.
"నేను ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని కాదుకానీ మీకు (వైజాగ్ వాసులు), నాకు మధ్య ప్రత్యేక బంధం ఉంది. నా యాక్షన్ మూవీస్ మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే సీడెడ్‌లో పెద్ద హిట్ అయ్యాయి. ఇక ఎంటర్‌టైనింగ్ సినిమాలు యూఎస్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ విజయాన్ని పొందాయి. నేపథ్యం ఏదైనా సరే అన్ని సినిమాలు ఓ రేంజ్లో ఆడిన ప్రాంతం వైజాగ్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడిని. జనవరిలానే డిసెంబరు కూడా సినిమాల పండగ నెలగా మారింది. మన తెలుగు దర్శకుడు.. బాలీవుడ్ హీరో (రణ్‌బీర్ కపూర్)తో తీసిన 'యానిమల్' డిసెంబరు 1న.. నా స్నేహితుడు నితిన్ హీరోగా తెరకెక్కిన 'ఎక్స్‌ట్రా: ఆర్డినరీ మ్యాన్' డిసెంబరు 8న, నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన 'డంకీ' (షారుక్ ఖాన్ హీరో) డిసెంబరు 21న, ప్రభాస్ అన్న నటించిన 'సలార్' సినిమా డిసెంబరు 22న, యాంకర్ సుమ తనయుడు నటించిన 'బబుల్‌గమ్' మూవీ డిసెంబరు 29న రిలీజ్ కానున్నాయి. ఈ మూవీస్ అన్నీ బ్లాక్‌బస్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇన్ని సినిమాల మధ్యలో వస్తున్నా.. 'హాయ్ నాన్న' మీ అందరి మనసులో నిలిచిపోయేలా ఉంటుంది. ఇది మీరు అనుకున్నట్లు ఓ ఎమోషనల్ ఫిల్మ్ కాదు. శౌర్యువ్ లాంటి కొత్త డైరెక్టర్లతో పనిచేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది. ఆయన భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. హేషమ్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తుంది. సినిమాలో ఇలాంటివి ఇంకా ఎన్నో సర్‌ప్రైజ్‌లున్నాయి" అంటూ నాని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అలా అభిమానుల్లో జోష్ నింపారు. ఇక మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఈ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై సందడి చేశారు.