వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నా.. మరో మంచి కథ దొరికితే చాలు పచ్చజెండా ఊపేయాలని కొందరు. సినీ డైరీ ఖాళీ అయ్యేలోపు ఓ కొత్త కబురు వినిపించాలని మరికొందరు.. ఇలా కథానాయకులంతా కథల వేటలో తలమునకలై ఉన్నారు. ఇందులో కొన్ని ప్రాజెక్ట్‌లు ఇప్పటికే పక్కా అయినట్లు సమాచారం. అవి త్వరలోనే కార్యరూపంలోకి రానున్నట్లు తెలుస్తోంది.
నాని రొమాంటిక్ కామెడీ
కొత్త ప్రతిభను.. కొత్త కథల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు కథానాయకుడు నాని. ప్రస్తుతం ఆయన చేస్తున్న 'దసరా' ఇలాంటి ప్రయత్నమే. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడ్ని తెరకు పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత నాని చేయనున్న కొత్త చిత్రం సైతం ఓ నూతన దర్శకుడే రూపొందించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొన్ని వెబ్‌సిరీస్‌లతో నిరూపించుకున్న శౌర్య అనే దర్శకుడు నానికి ఓ కథ వినిపించారని.. అది ఆయనకు నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకరించారని సమాచారం. ఇదొక భిన్నమైన రొమాంటిక్ కామెడీ చిత్రంలా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీన్ని చెరుకూరి మోహన్ నిర్మించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, 'దసరా' పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కుతుందని ప్రచారం వినిపిస్తోంది.
ఈనెలలోనే శ్రీకారం..
నాగచైతన్య కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత చైతూ చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు. ఆయన కోసం పరశురామ్ ఓ కథ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపించినా.. ఆ తర్వాత దానిపై స్పష్టత రాలేదు. దీనికి తోడు ఇటీవల ఆయన బాలకృష్ణకు ఓ కథ వినిపించనున్నట్లు చెప్పడంతో చైతన్యతో సినిమా లేకపోవచ్చని ప్రచారం వినిపించింది. అయితే ఇప్పుడు నాగచైతన్య - పరశురామ్‌ల ప్రాజెక్ట్ ఖరారైనట్లు సమాచారం. దీన్ని 14రీల్స్ ప్లస్ పతాకంపై నిర్మించనున్నారు. వెంకట్ ప్రభు సినిమా పూర్తి కాగానే ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.