తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆసక్తికరంగా నాయికల ఎంపిక.. ఏ అందానికి అవకాశం దక్కేనో! - కియారా అద్వానీ తెలుగు సినిమా

తెలుగులో స్టార్​ హీరోల సరసన నాయికల ఎంపిక ఆసక్తికరంగా మారింది. అగ్ర తారల సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో.. ఎప్పుడు విడుదలవుతాయో అంచనా వేయలేం. ఆ సినిమాలు ఎప్పుడు ఎలా ఎవరెవరి కలయికలతో ఖరారవుతాయో కూడా ఒక పట్టాన అర్థం కాదు. టాలీవుడ్‌ పలు కీలకమైన ప్రాజెక్టులకి రంగం సిద్ధమవుతున్న వేళ.. ఏ కథానాయికకి ఏ సినిమా సొంతం అవుతుందనేదే ఇప్పుడు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

tollywood combinations
టాలీవుడ్ కాంబినేషన్స్

By

Published : Dec 17, 2022, 7:10 AM IST

తెలుగులో అగ్ర తారల సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో.. ఎప్పుడు విడుదలవుతాయో అంచనా వేయలేం. ఆ సినిమాలు ఎప్పుడు ఎలా ఎవరెవరి కలయికలతో ఖరారవుతాయో కూడా ఒక పట్టాన అర్థం కాదు. దర్శకుడు ఒక హీరో కోసం కథ రాసి.. అందుబాటులో ఉన్న మరో హీరోకి వినిపించి.. అది ఇంకొక హీరోతో సెట్‌ అయితే.. తీరా ప్రారంభానికి ముందు ఇంకో హీరోతో ఆ సినిమా పక్కా అయినట్టుగానే ఉంటుంది వ్యవహారం. ఈమధ్య చాలా సినిమాలకి ఇదే తరహాలో ఖరారయ్యాయి. ఇక వాటికి కథానాయికల ఎంపికలో అయితే ఇంకెన్నెన్నో మలుపులు. ఎలాగైతేనేం టాలీవుడ్‌ పలు కీలకమైన ప్రాజెక్టులకి రంగం సిద్ధమవుతున్న వేళ.. ఏ కథానాయికకి ఏ సినిమా సొంతం అవుతుందనేదే ఇప్పుడు సినీ ప్రియులకి ఆసక్తికరంగా మారింది.

సంక్రాంతి సినిమాలు మొదలుకొని సెట్స్‌పై ఉన్న ప్రభాస్‌, పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ చిత్రాల వరకూ ఎప్పుడెప్పుడా సినీ ప్రియుల్ని ఇప్పటికే ఊరిస్తున్నాయి. వచ్చే నెలల్లోనే వరుసగా పట్టాలెక్కుతున్న ఎన్టీఆర్‌, మహేష్‌బాబు సినిమాలతోపాటు.. 2023లో మరింతమంది అగ్ర తారలు తమ కొత్త సినిమాలకి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే ఆయా ప్రాజెక్టులకి సంబంధించిన విషయాలు ఒకొక్కటిగా వెలుగులోకి రావడం మొదలైంది. కరోనా ఆటుపోట్లతో అలజడికి గురైన చిత్రసీమ వచ్చే యేడాది మాత్రం సూపర్‌ వేగంతో ప్రయాణిస్తుందనే సంకేతాలు వస్తున్నాయి. ఆయా ప్రాజెక్టులకి సంబంధించిన పనులు చకచకా సాగుతుండడమే అందుకు తార్కాణం. అందుకే ఇప్పుడు కొత్త జోడీ ముచ్చట్లు మరింత జోరుగా వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల కిందటే ఖరారైన ఈ సినిమా కోసం కథానాయిక అలియాభట్‌ని సంప్రదించి ఆమెకి కథ కూడా వినిపించారు. కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌ కథ మారింది. ఫిబ్రవరిలో ఈ సినిమా పట్టాలెక్కనుండడం వల్ల రష్మికతో సహా ఇప్పుడు కొత్త నాయికల పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తుందనే ప్రచారం ఈమధ్య ఊపందుకుంది. జాన్వీ పేరు మరో ప్రాజెక్ట్‌ విషయంలోనూ వినిపిస్తోంది. ఈసారి ఆమె రామ్‌చరణ్‌తోనూ జోడీ కట్టే అవకాశాలున్నాయని టాలీవుడ్‌ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమా కోసం కూడా జాన్వీని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇద్దరు హీరోయిన్లు కావాలి..
'హరి హర వీరమల్లు' సినిమాతో బిజీగా ఉన్న పవన్‌కల్యాణ్‌ త్వరలో కొత్తగా రెండు సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. అందులో ఒకటి 'వినోదాయ సిద్ధం' రీమేక్‌ కాగా, మరొకటి హరీష్‌శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' సినిమా. 'వినోదాయ సిద్ధం'లో పవన్‌కి జోడీగా నటించే భామ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' సినిమాకి కూడా ఇంకా కథానాయిక ఎంపిక పూర్తి కావల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ 'భవదీయుడు భగత్‌సింగ్‌'గా ఉన్న సమయంలో పూజాహెగ్డే పేరు వినిపించినా, ఇప్పుడు ఆమెనే ఖరారు చేస్తారా లేక వేరొకరిని పరిశీలిస్తారా అనేది చూడాలి. మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ కలయికలో సినిమా కోసం పూజాహెగ్డే, శ్రీలీల ఖరారైన సంగతి తెలిసిందే. అయితే వచ్చే యేడాది జూన్‌లో మహేష్‌-రాజమౌళి సినిమా పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో అంచనాలున్న ఆ సినిమాలో కథానాయిక అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. మరోసారి రాజమౌళి హిందీ నుంచే కథానాయికల్ని రంగంలోకి దింపుతారేమో చూడాలి.

రష్మిక, పూజాహెగ్డే, కీర్తిసురేష్‌, శ్రుతిహాసన్‌, తమన్నా, సాయిపల్లవి.. ఇలా బోలెడంతమంది స్టార్‌ భామలు తెలుగులో అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నారు. హిందీలో కియారా అడ్వాణీ ఎంత బిజీగా గడుపుతున్నా క్రమం తప్పకుండా తెలుగులో నటిస్తోంది. శ్రీలీల, కృతిశెట్టి తదితర కొత్త నాయికలు వరుసగా అవకాశాల్ని అందుకుంటూ సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు కథానాయికలేరీ అనే ప్రశ్న వినిపించేది. ఇప్పుడు మాత్రం ప్రత్యామ్నాయంగా ఒకరినిమించి మరొకరు కనిపిస్తున్నారు. మరి ఎవరు ఎవరితో జట్టు కడతారో చూడాల్సిందే.

ఊహించని అవకాశాలు
కొన్ని ప్రాజెక్టులకి కథానాయికలు ఎవరూ ఊహించని రీతిలో ఖరారవుతున్నారు. బాలకృష్ణ-అనిల్‌ రావిపూడి కలయికలో సినిమా కోసం మొదట పలువురు బాలీవుడ్‌ భామల పేర్లని పరిశీలించారు. కానీ అనూహ్యంగా ఆ అవకాశాన్ని ప్రియాంక జవాల్కర్‌ సొంతం చేసుకుంది. స్టార్‌ కథానాయికలు ఎప్పుడూ బిజీగా గడుపుతుండడం, వాళ్ల డైరీలో డేట్స్‌ ఖాళీగా లేని సమయాల్లో ఆ అవకాశం మరొక కథానాయిక వశం అవుతుంటుంది. సీనియర్‌ హీరోలు వెంకటేష్‌, నాగార్జున కూడా వచ్చే ఏడాది ఆరంభంలో కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటించనున్నారు. విజయ్‌ దేవరకొండ, నాని కొత్త సినిమాలు కూడా పట్టాలెక్కనున్నాయి. అవకాశాలు సొంతం చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్న కథానాయికలకి తెలుగులో ఇది సరైన తరుణం అంటున్నారు సినీ పండితులు. ఒకేసారి బోలెడన్ని ప్రాజెక్టులకి రంగం సిద్ధమైంది కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే మంచి అవకాశాలే సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details