కొన్నేళ్లుగా చిత్రసీమలో నాయికా ప్రాధాన్య చిత్రాల జోరు పెరిగింది. అనుష్క, సమంత, కీర్తి సురేష్ వంటి స్టార్ నాయికల మొదలు.. కొత్తగా వచ్చిన నాయికల వరకు ఎవరి స్థాయికి తగ్గ కథలు వారికి సిద్ధమవుతున్నాయి. దీంతో నాయికా ప్రధానమైన సినిమాల సందడి అంతకంతకు రెట్టింపవుతోంది. మంచి విజయాలు దక్కుతుండటంతో నాయికలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కమర్షియల్ హీరోయిన్ పాత్రలు చేస్తున్నా చాలామంది నాయికల మనసంతా హీరోయిన్ ఓరియెంటెడ్ కథల మీదే ఉంటుంది. తెలుగులో ఇప్పటికే కొన్ని నాయికా ప్రాధాన్య సినిమాలు సెట్స్‌పై ముస్తాబవుతుండగా.. ఇప్పుడు మరికొన్ని కథలు కార్యరూపం దాల్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ కథలోకి సామ్!
Samantha : నాయికా ప్రాధాన్య చిత్రాలతో జోరు చూపిస్తోంది సమంత. ఆమె టైటిల్ పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'యశోద' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన 'శాకుంతలం' విడుదలకు సిద్ధమవుతోంది. కాగా.. ఇప్పుడామె కోసం మరో నాయికా ప్రాధాన్య కథ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 'చిలసౌ' సినిమాతో తొలి అడుగులోనే దర్శకుడిగా మెప్పించిన రాహుల్ రవీంద్రన్. ఆ వెంటనే నాగార్జునతో 'మన్మథుడు 2' చేసే అవకాశం అందుకున్నారు. కానీ, అది ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
ఆ తర్వాత ఆయన ఓ నాయికా ప్రాధాన్య కథను సిద్ధం చేసుకొని రష్మికకు వినిపించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడా కథనే రాహుల్ మార్పులు చేసి సమంతకు వినిపించినట్లు సమాచారం అందుతోంది. దీనిపై సామ్ కూడా సానుకూలంగా స్పందించిందని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. గీతా ఆర్ట్స్‌లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. సమంత ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో 'ఖుషి'లో నటిస్తోంది. హిందీలో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది.