తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

టాలీవుడ్​ను షేక్​ చేసిన కొత్తందాలు.. 2022లో తెరపైకి నూతన నాయికలు - రితికా నాయక్​ టాలీవుడ్​ మూవీస్​

చిత్రసీమకి ఊపిరి కొత్తదనం. భవిష్యత్తు కొత్తతరం! మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టుగా కథల్లోనూ, సాంకేతికతలోనూ, నటనలోనూ ఇలా అన్నిచోట్లా కొత్తదనం కనిపించాల్సిందే. కొత్తదనం అంటే కొత్తతరంతోనే సాధ్యం అని పరిశ్రమ నమ్మిన ప్రతిసారీ తెరపైన ఓ నవ తార మెరుస్తుంది. లేదంటే ఓ యువ దర్శకుడో, సాంకేతిక నిపుణుడో పరిచయం అవుతుంటాడు. అలా ఏటా సినీ రంగంలో కొత్త నీరు పరవళ్లు తొక్కుతూనే ఉంటాయి. ఈ ఏడాదీ తెలుగు తెరకు పదుల సంఖ్యలోకథానాయికలు పరిచయమై నయా శోభని తీసుకొచ్చారు.

heroines-introduced-in-tollywood-in-2022
heroines-introduced-in-tollywood-in-2022

By

Published : Dec 13, 2022, 7:08 AM IST

Updated : Dec 13, 2022, 9:09 AM IST

చిత్రసీమకి కథానాయికలు కీలకం. హీరోల సంఖ్యకి తగ్గట్టుగా నాయికలు లేకపోవడంతో తరచూ ఆ కొరత సినీ రూపకర్తల్ని వేధిస్తుంటుంది. కథానాయికల కోసం ప్రత్యేకంగా అన్వేషణ కొనసాగించాల్సి వస్తుంటుంది. అందుకే కొత్తందం తెరపై మెరిసిందంటే చాలు.. మన సినిమాకి పనికొస్తుందా అంటూ అటువైపు చూస్తుంటారు.

2021లో విడుదలైన 'ఉప్పెన'తో, 'పెళ్లిసందడి' సినిమాలతో మెరిసిన కృతిశెట్టి, శ్రీలీల ప్రస్తుతం అగ్ర కథానాయకుల సినిమాల్లో అవకాశాల్ని అందుకుంటూ జోరు ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది కూడా కొత్తందాలకి కొదవేం లేదు. అయితే ఈసారి పొరుగు భాషల నుంచి వచ్చినవాళ్లే ఎక్కువ.

మృణాల్​-నజ్రియా

హిందీ నాయికల జోరు
2022లో దర్శకులు కొత్త కథానాయికల్ని పరిచయం చేయడంకంటే, పొరుగు భాషల్లో సత్తా చాటుతున్న భామల్ని మన తెరపైకి తీసుకు రావడంపై మొగ్గు చూపారు. పాన్‌ ఇండియా మార్కెట్టే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాతో అలియాభట్‌, విజయ్‌ దేవరకొండ 'లైగర్‌'తో అనన్యపాండే తెలుగు తెరకు పరిచయం అయ్యారు. హిందీలో స్టార్లుగా కొనసాగుతున్న ఈ నాయికలు తెలుగులో నటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మిథిలా- అనన్యా పాండే

పాత్ర విషయంలో అలియా అభిమానులు కొంచెం అసంతృప్తి చెందినా, ఆమె విజయాన్ని మాత్రం నమోదు చేసింది. ఆ ఊపులో ఎన్టీఆర్‌తో కలిసి మరో సినిమాకీ ఆమె పచ్చజెండా ఊపింది. కానీ ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో మనసు మార్చుకుంది. ఆ ప్రాజెక్టు కూడా ఆలస్యమైంది. 'లైగర్‌'తో అనన్యపాండే మాత్రం పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. మరో హిందీ భామ మృణాల్‌ ఠాకూర్‌ 'సీతారామం'తో తెలుగు కుర్రాళ్ల మనసుల్ని గెలిచింది. హిందీలోనే రెండు సినిమాలు చేసిన షిర్లే సేటియా 'కృష్ణ వ్రింద విహారి'తో, మిథిలాపాల్కర్‌ 'ఓరి దేవుడా' సినిమాతో సందడి చేశారు. వీళ్ల అందం, నటన పరిశ్రమని ఆకట్టుకున్నాయి.

ఆలియా భట్​ ఐశ్వర్య లక్ష్మీ

మలయాళం నుంచి..
'భీమ్లానాయక్‌', 'బింబిసార' సినిమాలతో పరిచయమైన మలయాళీ భామ సంయుక్తమేనన్‌ ఈ ఏడాది తెలుగు పరిశ్రమని బాగా ఆకట్టుకుంది. ఆమె ప్రస్తుతం ధనుష్‌తో కలిసి ద్విభాషా చిత్రం 'సార్‌'లో నటిస్తోంది. ఈసారి ప్రేక్షకుల్ని బాగా ఊరించిన మరో మలయాళ భామ నజ్రియా. నానితో కలిసి 'అంటే సుందరానికి' చిత్రంలో నటించింది. అంతకుముందు అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె, నేరుగా నటించిన తొలి తెలుగు చిత్రం ఇదే. కానీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

సంయుక్త మేనన్​-షిర్లీ

'రామారావు ఆన్‌ డ్యూటీ'తో తెలుగులో సందడి చేసిన మలయాళ భామ రజీషా విజయన్‌ కూడా అంతే. విజయం దక్కలేదు. 'గాడ్సే' సినిమాతో పరిచయమైన ఐశ్వర్యలక్ష్మి ఈసారి తెలుగుపై బలమైన ముద్ర వేశారు. 'మట్టికుస్తీ', 'అమ్ము', 'పొన్నియిన్‌ సెల్వన్‌' చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.

వీళ్లతోపాటుగా.. తెలుగుకు 'అశోకవనంలో అర్జునకళ్యాణం'తో పరిచయమైన రితిక నాయక్‌ నటన, అందం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 'ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో'తో సంచిత బసు, 'అల్లూరి' సినిమాతో కయాదు లోహార్‌, 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' చిత్రంతో సంజన ఆనంద్‌, సోను ఠాకూర్‌, 'హైవే'తో మానస రాధాకృష్ణ తెలుగుకు పరిచయమయ్యారు. కృతిశెట్టి, శ్రీలీల తరహాలో పరిచయ చిత్రంతోనే ప్రభావం చూపించిన భామలు ఈ ఏడాది కనిపించలేదు.

Last Updated : Dec 13, 2022, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details