"ఈమధ్యే నేను సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్య చేసినట్టుగా మన జీవితాల్లో కొన్ని మంచిరోజులు ఉంటాయి, కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒకొక్క రోజు ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది. కొన్ని రోజులు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం వచ్చానా అనిపిస్తుంది (భావోద్వేగానికి గురవుతూ). కానీ నేనొక్కటే కాదు, చాలా మంది నాలాగా పోరాటం చేస్తున్నారు. చివరికి గెలుపు మాత్రం మాదే. అయితే చాలామంది అనుకుంటున్నట్టుగా నేనున్న ప్రస్తుత పరిస్థితి ప్రాణాంతకమైనదేమీ కాదు. ప్రస్తుతానికైతే నేను చావలేదు (నవ్వుతూ). అయితే ఇది కష్టమైన స్థితే, ఇప్పటికీ నేను పోరాటం చేస్తున్నా. త్వరలోనే పరిస్థితులు మెరుగవుతాయని ఆశిస్తున్నా. ఈ క్షణం నేను ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. 'యశోద' విడుదల గురించి ఇప్పుడు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా''.
'నా స్థితి ప్రాణాంతకమైందేమీ కాదు.. కానీ కష్టమైంది.. ఆరోగ్యం సహకరించకున్నా డబ్బింగ్ చెప్పా' - సమంత ఆరోగ్య పరిస్థితి
జబ్బుతో బాధపడుతూ ఒక చేతికి సెలైన్ బాటిల్... సినిమా కోసం మరొక చేతిలో స్క్రిప్ట్ పేపర్. ‘యశోద’ చిత్రం కోసం సమంత పనిచేసిన విధానం అదీ. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తూ... చిత్రీకరణలతోనూ, ప్రచార కార్యక్రమాలతోనూ సందడి చేసే సమంత కొన్ని రోజులుగా మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేస్తోంది. చికిత్స తీసుకుంటూనే తన కొత్త చిత్రం ‘యశోద’ కోసం డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. ఈ సినిమా ఈ నెల 11న పాన్ ఇండియాస్థాయిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సమంత ఈ సినిమా ప్రచారం కోసం కెమెరా ముందుకొచ్చారు. జబ్బుతో తాను పోరాటం చేస్తున్న విధానం గురించీ... తన సినిమా గురించీ మనసు విప్పారు.
"నేను ఏదైనా ఓ స్క్రిప్ట్ ఒప్పుకోవడానికి ఒక రోజు సమయం తీసుకుంటా. కానీ 'యశోద' కథని మాత్రం విన్న వెంటనే ఒప్పుకున్నా. అంతగా నాకు యశోద పాత్ర నచ్చింది. శక్తిమంతమైన కథ ఇది. దర్శకులు హరి - హరీష్ కొత్త కాన్సెప్ట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 'యశోద' కంటే ముందు థ్రిల్లర్ కథలంటే 'యు టర్న్' చేశా. కానీ ఇది కొత్తగా ఉంటుంది. 'ఫ్యామిలీ మేన్ 2' తర్వాత మళ్లీ ఇందులో పోరాట ఘట్టాలు చేశా. వాటిని చేయడాన్ని ఆస్వాదించా. ఇందులో నేనొక గర్భవతిగా కనిపిస్తా. ఆ పాత్రకి తగ్గట్టుగా చక్కటి యాక్షన్ డిజైన్ చేశారు యానిక్ బెన్, వెంకట్ మాస్టర్. ఆ సన్నివేశాల కోసం నేను చాలా సన్నద్ధమై నటించా''.
"ఈ కథలో గొప్ప భావోద్వేగం ఉంది. ప్రేక్షకుల్ని కట్టిపడేసేంత బిగి ఉందని అర్థమైంది. చిత్రీకరణ సమయంలో మా నమ్మకం మరింతగా పెరిగింది. ఈ కథకి అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనుకున్నా. అందుకే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం. వివిధ భాషలకి చెందిన నటులు ఇందులో ఉన్నారు. అంతమందితో కలిసి నటిస్తూ చాలా విషయాల్ని నేర్చుకున్నా. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సినిమా గొప్పగా ఉండాలని తపించారు. ఖర్చుకు వెనకాడకుండా తీశారు. 'యశోద'కి నేనే డబ్బింగ్ చెప్పాలని ముందు నుంచే నిర్ణయించుకున్నా. ఒక్కసారి ఏదైనా నేననుకున్నానంటే అది చేసి తీరాల్సిందే. ఓ పాత్ర చేసేటప్పుడు నటులు ప్రాణం పెట్టినప్పుడు వాళ్లే డబ్బింగ్ చెప్పాలని, సొంత గొంతు వినిపించాలని కోరుకుంటా. నాలోనూ ఆ పట్టుదల, మొండితనం ఎక్కువ. అందుకే నా ఆరోగ్య పరిస్థితులతో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ డబ్బింగ్ చెప్పా''.